Movies Against Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్ కు వ్యతిరేకంగా సినిమాలు రానున్నాయా? ప్రత్యేక సినిమాలు తీసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను వ్యతిరేకిస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. అప్పట్లో కొన్ని కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. అయితే సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇది ప్రజాదరణ పొందాయా? లేదా? అన్నది పక్కన పెడితే మాత్రం ఈ సినిమాలు ఎన్నెన్నో వివాదాలు సృష్టించాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయి. అటువంటి వాటి జోలికి ఇప్పుడు టిడిపి కోటను వెళ్తుందా? అన్నది చూడాలి.
టిడిపికి సినీ గ్లామర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే తెలుగుదేశం( Telugu Desam) కూటమికి సినీ గ్లామర్ ఎక్కువ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్ర కథానాయకుడిగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బుల్లితెర నటులు సైతం కూటమి వైపే ఉన్నారు. ఈ క్రమంలో కొందరు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా సినిమాలు తీద్దాం అంటూ ప్రభుత్వ పెద్దల వద్దకు వస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ వంటి వారు వరుసగా సినిమాలు తీశారు. కానీ అవి ప్రజల్లోకి వెళ్ళలేదు. పైగా ప్రయత్నాలు వికటించాయి కూడా. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సినిమాలు తీయడం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆదో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ గా మారింది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అది మేలు చేయలేదు. కానీ ఈ సినిమాల పుణ్యమా అని దర్శకుడు తో పాటు అందులో నటించిన నటీనటులకు మాత్రం కొంత మేలు జరిగిందని చెప్పవచ్చు. అయితే మరోసారి అటువంటి ప్రయత్నాలు చేసి ప్రజల్లో చులకన అవుతామని టిడిపి పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ముందుకు వస్తున్న దర్శకులు, నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
Also Read: Jagan Sattenapalli Visit: జగన్ కు ఏపీ పోలీసుల షాక్
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అప్పట్లో
వాస్తవానికి నందమూరి తారకరామారావు( Nandamuri Tarak Rama Rao ) ఉన్ననాటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు వచ్చాయి. సినీ నటుడు కావడం, ఉవ్వెత్తిన ప్రజాదరణ పొందడం, అందుకే అదే సినీ గ్లామర్ తో ఆయనకు ఇబ్బంది పెట్టాలని ఎన్నికల సమయంలో చాలామంది ప్రయత్నించారు. అలా వచ్చిన చిత్రాలే పిచ్చోడు చేతిలో రాయి, మండలాధీశుడు లాంటివి. ముఖ్యంగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా అప్పట్లో ఎక్కువగా సినిమాలు తీశారు దాసరి నారాయణరావు. కానీ అప్పట్లో అది పెద్దగా ప్రజాదరణకు నోచుకోలేదు. అయితే 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చాలా చిత్రాలు తీశారు. రాంగోపాల్ వర్మ అయితే చంద్రబాబుతో పాటు పవన్ పాత్రలను సైతం సృష్టించారు. వారి ముఖ కవళికలతో ఉన్న వారిని గుర్తించి సరైన పాత్రలు సృష్టించారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ప్రజల్లోకి వెళ్లలేదు.
ఎన్నెన్నో అంశాలతో కథలు సిద్ధం..
అయితే తెలుగుదేశం పార్టీ పరంగా ఎప్పుడు ప్రత్యేకంగా సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో మరింత పలుచన చేసేందుకు ఇదే సరైన సమయం అని కొందరు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ పార్టీ విధానాలను హైలెట్ చేస్తూ కథలు తయారు చేస్తున్నారు. బటన్ నొక్కే కార్యక్రమం, సిద్ధం సభలు, పర్యటనల్లో పరదాలు వంటి అంశాలను హైలెట్ చేస్తూ కొందరు కథలు రాస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల వద్దకు వచ్చేసరికి ఆ కథలకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దీంతో చిత్రాలు తీద్దామనుకుంటున్న వారికి నిరాశ తప్పడం లేదు. అయితే టిడిపి తలచుకుంటే.. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే జగన్కు వ్యతిరేకంగా చాలా చిత్రాలు తయారయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో సమకాలీన రాజకీయ అంశాలను ప్రభావితం చేసే కొద్దిపాటి సంభాషణలు ఉంటున్నాయి. అటువంటివి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పొలిటికల్ సెటైర్ చిత్రాలు తీయడం అనేది రాజకీయాలను కలుషితం చేయడమే అవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చిత్రాలు తీయాలనుకుంటున్న వారికి ప్రభుత్వ పెద్దలు బ్రేక్ చెబుతున్నారు.