Monsoon Winds Hitting AP: ఏపీకి శుభవార్త. రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. సోమవారం రాయలసీమలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అరేబియా సముద్రం, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరట్వాడ, కర్ణాటక, తమిళనాడులో అనేక ప్రాంతాలతోపాటు రాయలసీమలోని తిరుపతి వరకు, ఇంకా తూర్పు భారతంలో పశ్చిమ బెంగాల్, బిహార్‌లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, విదర్భ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఈ నెల 17వ తేదీ నాటికి కోస్తాలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.కాగా, ఈ ఏడాది మే 29 నాటికి కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు.. తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంలో జాప్యం జరిగింది. సాధారణంగా జూన్ నాలుగో తేదీకల్లా రాయలసీమ, 8వ తేదీకల్లా దక్షిణ కోస్తాలోని ఒంగోలు, 11వ తేదీ నాటికి విశాఖపట్నం రుతుపవనాలు రావలసి ఉంది. అయితే రుతుపవనాల పురోగతిలో వేగం లోపించడంతో ఆలస్యమైంది. సోమవారం నాటికి తిరుపతి వరకు రుతుపవనాలు విస్తరించినా.. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం తప్ప మిగిలినచోట్ల వర్షాలు పడలేదు.

అందుకే పుంజుకోలేదు!
రుతుపవనాలు సాధారణ తేదీ కంటే 3 రోజుల ముందుగా కేరళలో ప్రవేశించినా రుతుపవన కరెంట్ పుంజుకోలేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో అంచనాకు అనుగుణంగా పడమర గాలులు బలపడలేదని, హిందూ మహాసముద్రంలో వాతావరణం అనుకూలంగా లేదని పేర్కొంటున్నారు. వీటి ప్రభావంతో రుతుపవన కరెంట్ బలపడనందున రుతుపవనాలు జోరుగా ముందుకు కదలడం లేదని వివరిస్తున్నారు. దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడం నైరుతి విస్తరణలో జాప్యానికి కారణంగా ఇస్రో నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున వేసవి తీవ్రత కొనసాగుతుందన్నారు. సాధారణంగా జూన్ నెలలో వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రుతుపవన మేఘాల వల్ల వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడుతుందని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేనందునే మే నెల మాదిరిగా ఎండలు కాస్తున్నాయన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, తరువాత ఉత్తర కోస్తా వరకు రుతుపవనాలు విస్తరిస్తాయని ఆయన అంచనా వేశారు.
మండిన ఎండ

కోస్తాలో అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలుచోట్ల సోమవారం ఎండ తీవ్రత కొనసాగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు వడగాడ్పులు వీచినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మొత్తం 168 మండలాల్లో వేడి వాతావరణం నెలకొందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి నమోదయ్యాయని పేర్కొంది. రాజవొమ్మంగిలో 41.9, కడియంలో 41.8, సీతానగరంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. ఒకవైపు ఎండ, మరో వైపు ఉక్కపోతతో ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతం. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో జనం బెంబేలెత్తిపోయారు. రాత్రి 12 గంటల వరకూ వాతావరణ చల్లబడలేదు. ప్రజలకు బాధలు తప్పలేదు.