YCP Leaders Join in Janasena : రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జనసేనలో చేరడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అయితేనే సేఫ్ జోన్ అని భావిస్తున్నాయి. టిడిపిలో ఇప్పటికే ప్రతిష్టమైన నాయకత్వం ఉంది. ద్వితీయ శ్రేణి క్యాడర్ ఉంది. అక్కడకు వెళ్లిన వారిని తట్టుకొని నిలబడడం ఇబ్బందికరమని వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి. ముందుగా వైసీపీని వీడడం ఉత్తమమని భావిస్తున్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు పార్టీ నుంచి బయట పడుతున్నారు. కూటమి పార్టీల్లో.. ఏదో ఒకదాంట్లో చేరితే తమకు ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భవిష్యత్తు రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. జనసేనలో చేరితే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో వైసిపి ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్లు సైలెంట్ అయ్యారు. వైసిపి హయాంలో రివేంజ్ రాజకీయాలు నడిచాయి. ప్రత్యర్థులపై కేసులతో వెంటాడారు. ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం అదే స్థాయిలో ప్రతీకార రాజకీయాలకు దిగితే తమ పరిస్థితి ఏంటని ఎక్కువమంది సీనియర్లు దిగాలుగా ఉన్నారు. అందుకే వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతున్నారు. మరి కొందరు పార్టీ నుంచి బయటపడడమే మేలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీని మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సిద్దా రాఘవరావు, వాళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, మద్దాలి గిరి వంటి వారు వీడారు. అయితే ఇందులో మెజారిటీ నేతలు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపడం విశేషం.
* ఎక్కువమంది ఆ ఆలోచనతోనే
వైసిపి నేతలు జనసేన లో చేరడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజనకు వాటి సంఖ్య 225 కు చేరే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాలు సైతం 32 వరకు పెరగనుంది. ఈ లెక్కతో జనసేన ఈ ఐదేళ్ల కాలంలో తప్పకుండా అభివృద్ధి చెందుతుంది.రాజకీయంగా మంచి స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్న సింహభాగం సీట్లు దక్కించుకుంటుంది. ఈ అంచనా తోనే ఎక్కువమంది వైసీపీ నేతలు జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
* కీలక నేతల ఆసక్తి
ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య వేరువేరుగా పవన్ ను కలిశారు. జనసేనలో చేరుతామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించారు. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అదే సమయంలో జనసేన సైతం జాగ్రత్తలు తీసుకుంటుంది.నేతల జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు,పార్టీలో ఉన్న నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
* క్యాడర్ ది అదే బాట
అయితే కీలక నేతలతో పాటు వైసీపీ క్యాడర్ సైతం జనసేన వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం జనసేనలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసిపి యూత్ జోనల్ ఇన్చార్జ్ అవనాపు విక్రమ్, డాక్టర్ అభనాపూర్ భావన జనసేనలో చేరుతున్నారు. ప్రకాశం జిల్లా కు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పిటిసి డాక్టర్ యాదాల రత్న భారతి సైతం జనసేనలో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కార్పొరేటర్లు సైతం జనసేన గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనలోకి సామూహికంగా నేతల ప్రవేశం ఈనెల 26న ఉంటుందని సమాచారం.