Mohan Babu Arrest: నటుడు మంచు మోహన్ బాబుకు( manchu Mohan Babu ) ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ వ్యవహారంలో మోహన్ బాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా చూడాలని.. తగిన ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా తరువాత చర్యలు నిలిపివేసేలా పోలీసులకు ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కానీ ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. విచారణ జరుగుతున్న సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని తేల్చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ కు సంబంధించి విచారణను వచ్చేనెల మూడుకు వాయిదా వేసింది.
* విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్.. తిరుపతిలో( Tirupati) మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. అయితే ధర్నాకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్ కు గురయ్యారు. దీంతో మిగతా విద్యార్థి సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి విద్యార్థి సంఘాల నేతలను విడిపించారు. ఐక్య కిడ్నాపర్లంతా మోహన్ బాబు కాలేజీలో బౌన్సర్లుగా గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘం నాయకుల ఫిర్యాదుతో మోహన్ బాబు పై కేసు నమోదు అయింది. ఒకానొక దశలో మోహన్ బాబు అరెస్టు ఉంటుందని ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలోనే తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
* తరచూ వివాదాలు..
అయితే ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో అనేక రకాల వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. గతంలో యూనివర్సిటీ వ్యవహారాలపై మంచు మనోజ్ మాట్లాడారు. తన తండ్రికి వాస్తవాలు తెలియవని చెప్పుకొచ్చారు. అయితే మంచు కుటుంబంలో వివాదాలు సమసిపోయాయి. కానీ ఇప్పుడు విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ వ్యవహారం మోహన్ బాబు మెడకు చుట్టుకుంది. అయితే ఈ కేసుతో మోహన్ బాబుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తరుపు న్యాయవాదులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని.. హైదరాబాదు నుంచి తిరుపతికి వచ్చారని అందుకు సంబంధించిన ఆధారాలను సైతం కోర్టుకు సమర్పించారు. కానీ విచారణ జరుగుతున్న సమయంలో అరెస్టుపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో మోహన్ బాబుకు షాక్ తగిలినట్లు అయ్యింది.