Modi Visakhapatnam Railway Zone : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన ఆశయంగా మారిన విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కాగితాలపైనే మిగిలిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన ఈ జోన్ ప్రకటన 2019 ఫిబ్రవరిలోనే జరిగింది. అప్పటి నుంచి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అయితే కార్యాలయ నిర్మాణానికి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
2025 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా.. ఐదు నెలలు గడిచినా భూమి పూజకు మించి పనులు ప్రారంభం కాలేదు. 149 కోట్ల రూపాయల వ్యయంతో 9 అంతస్థులుగా ఈ ఆఫీసును నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థులు పార్కింగ్ కోసం కేటాయించనున్నారు. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి, సంబంధిత కంపెనీకి పనులు అప్పగించినట్లు సమాచారం.
అయితే కార్యాలయ నిర్మాణంతో పాటు ఈ జోన్‌కు కావాల్సిన అధికారులు ఇంకా నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రత్యేక అధికారి ఉన్న ఈ జోన్‌కు తాజాగా జనరల్ మేనేజర్ (GM) పోస్టు భర్తీ చేశారు. వడోదరలోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ పోస్టును విశాఖ జోన్‌కు బదలాయించారు.
ఇక అసిస్టెంట్ జీఎం, పది విభాగాలకు ముఖ్య విభాగాధిపతులు, ప్రిన్సిపల్ హెచ్ఓడీలు, ఇతర విభాగాధిపతులు కలిపి మొత్తం 170 మందిని నియమించాల్సి ఉంది. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్ కూడా ఉంది.
ప్రత్యక్ష అభివృద్ధి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మళ్లీ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎప్పటికప్పుడు రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయం తెలిసిందే. దీంతో మోదీ సర్కారు ఈ జోన్ పనుల్లో వేగం పెంచుతుందా? లేదా పవన్ రంగంలోకి రావాల్సిన అవసరం వస్తుందా? అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రజల ఆశలు నెరవేరాలంటే కేంద్రం స్పందించాల్సిందే… లేకపోతే మరోసారి విఫల హామీల జాబితాలో ఈ రైల్వే జోన్ కూడా చేరిపోతుందన్న అనుమానం ప్రజల్లో పెరుగుతోంది.