MLC Nagababu: మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) ఎమ్మెల్సీగా ఉన్నారు.. ఆయన రాష్ట్ర మంత్రి కావడం ఖాయం. ఎందుకంటే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సాక్షాత్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్సీగా చట్టసభల్లో నాగబాబు ప్రవేశించారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయి దాదాపు ఏడాది సమీపిస్తోంది. కానీ ఇంతవరకు మంత్రివర్గంలో చోటు లేదు. అలాగని మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. దీంతో ఆ నియోజకవర్గ బాధ్యతలను నాగబాబు చూస్తారని ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆయన మనస్సు ఉత్తరాంధ్ర వైపు మారినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీగా ఉన్నవారు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. తన ఎమ్మెల్సీ నిధులు కానీ.. ప్రభుత్వంతో మాట్లాడితే తెచ్చుకునే ప్రత్యేక నిధులు ఎంపిక చేసుకునే నియోజకవర్గంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మెగా బ్రదర్స్ శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం వర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
తరచూ జిల్లాలో పర్యటన..
ఇటీవల తరచు ఎమ్మెల్సీ నాగబాబు శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) పర్యటిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రస్తుతం బిజెపి ఎమ్మెల్యే ఈశ్వరరావు ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఆపై తెలుగు సామాజిక వర్గం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక నియోజకవర్గం అవసరం. అయితే ఇప్పుడు చేతిలో ఎమ్మెల్సీ పదవి ఉంది. తప్పకుండా ఆయన మంత్రి అవుతారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ కంటే ఉత్తరాంధ్ర పై జనసేన పట్టు పెంచుకునేందుకే నాగబాబు ఎచ్చెర్ల నియోజకవర్గం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నాగబాబు ఎచ్చర్ల నియోజకవర్గం ఎంచుకోవడంతో యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఇకనుంచి నాగబాబుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పిస్తారని తెలుస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే తో పాటు ఎమ్మెల్సీ ని సైతం ఆహ్వానించాల్సి ఉంటుంది.
ఆ ఆలోచనతోనే..
ప్రస్తుతం అక్కడ బిజెపి ఎమ్మెల్యే ఈశ్వరరావు( MLA Eswar Rao ) ఉన్నారు. ఆయన విషయంలో మూడు పార్టీల కేడర్ సంతృప్తిగానే ఉంది. అయితే ఇప్పుడు నాగబాబు వస్తుండడంతో అది రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాగబాబు ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే జనసేన అంతర్గత వర్గాలు మాత్రం ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు ఎచ్చెర్ల మధ్యమార్గంగా ఉంటుందని.. ఉత్తరాంధ్ర పై ఫోకస్ పెట్టేందుకే నాగబాబు అక్కడ ఇన్చార్జిగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా నాగబాబు శ్రీకాకుళం జిల్లాకు వస్తూ పోతూ ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా వీలైనంత ఎక్కువ సీట్లను ఉత్తరాంధ్ర నుంచి తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది జనసేన. అందుకే నాగబాబు ఎచ్చెర్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే నాగబాబు పరిధి పెరుగుతోంది.