Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్ సీరియస్ గా యాక్షన్ లోకి దిగనున్నారు. ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు దాటుతోంది. ప్రధానంగా గెలిచిన తర్వాత తన సొంత నియోజకవర్గం మంగళగిరి పై ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు. తరచూ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. మరోవైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన నామినేటెడ్ పదవుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారు. లోకేష్ ఇచ్చిన సమాచారంతోనే చంద్రబాబు టిడిపి పరంగా నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పాఠశాల విద్యాశాఖను సైతం గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు లోకేష్. ఇప్పుడు కీలకమైన ఐటీ శాఖ పై ఫోకస్ చేశారు. విశాఖలో ఐటి అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పుడు ఐటీ పరిశ్రమలను విశాఖకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా అమెరికా వెళ్ళనున్నారు. అక్కడ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.
* ఐటీ పరంగా విశాఖ అభివృద్ధి
2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం విశాఖ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఐటీ పరంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలని నాడు చంద్రబాబు సంకల్పించారు. అందులో భాగంగా చాలా స్టార్టాప్ కంపెనీలను ఆహ్వానించారు. స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించాయి కూడా. అయితే ఇంతలో అధికారం మారిపోవడం.. వైసిపి పవర్ లోకి రావడంతో విశాఖ ఐటీ పరిశ్రమ మరుగున పడిపోయింది. చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ తిరిగి తెచ్చే బాధ్యతలను తీసుకున్నారు లోకేష్. ముందుగా విశాఖను ఐటీ పరంగా అభివృద్ధి చేయడం లోకేష్ ముందున్న లక్ష్యం. ఆ తరువాత విజయవాడ తో పాటు తిరుపతి పై ఫోకస్ చేయనున్నారు.
* వారం రోజులపాటు అమెరికాలో
ఈనెల 25న అమెరికా వెళ్ళనున్నారు లోకేష్. వారం రోజులు పాటు అక్కడే గడపనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి పేరు మోసిన ఐటీ పరిశ్రమల ప్రతినిధులు అక్కడ కు రానున్నారు. అటువంటి పరిశ్రమలను ఏపీకి ఆహ్వానించనున్నారు లోకేష్. ముఖ్యంగా విశాఖ నగరానికి ఉన్న ప్రాముఖ్యతను వారికి వివరించనున్నారు. అన్ని విధాలా ఒప్పించి.. పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేయనున్నారు. అదే జరిగితే నవంబర్ నాటికి ఐటీ పరిశ్రమల రాక ప్రారంభం కావడం అనివార్యం. తద్వారా మంత్రిగా తొలి రోజుల్లోనే మంచి మార్కులు సాధించాలని లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.