https://oktelugu.com/

Minister  Lokesh : మంత్రి లోకేష్ టీ,స్నాక్స్ ఖర్చు లక్షల్లోనా.. ప్రపంచంలోనే ఖరీదైన బిస్కెట్ తింటారా? నిజమేనా?

నిజం నింపాదిగా బయలుదేరక ముందే.. అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుందంటారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని జరుగుతోంది అదే. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుఇట్టే ప్రచారం చేస్తున్నారు. ప్రజలను అయోమయంలో పడేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 21, 2024 1:56 pm
    Minister Lokesh

    Minister Lokesh

    Follow us on

    Minister  Lokesh : మంత్రి లోకేష్ కార్యాలయంలో భారీ ఖర్చు జరుగుతోందా? టీ,స్నాక్స్ ఖర్చు లక్షల్లో పెడుతున్నారా? ప్రపంచంలో ఖరీదైన బిస్కెట్లు తింటున్నారా? సోషల్ మీడియాలో దీనిపై చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నెలకు లక్షల్లో స్నాక్స్ ఖర్చు అవుతోందని ట్విట్ ఒకటి వైరల్ కావడంతో పెద్ద దుమారమే రేగుతోంది. వైసిపి హయాంలో ఎగ్ పఫ్ ఖర్చులకే మూడున్నర కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేవలం అక్కడ పనిచేసే సిబ్బంది, అధికారులు రోజుకు 1000 ఎగ్ పఫ్ లు తినేవారని ఒక వార్త బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళింది. ఈ తరుణంలోనే లోకేష్ కార్యాలయం పై కూడా ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగింది. ‘ నారా లోకేష్ రోజు తాగే టీ ఖర్చు విలువ రూ. 2 లక్షలు. అదే నెలకు 60 లక్షల రూపాయలు.నారా లోకేష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బోహో రెయిన్బో కుకీస్ తింటున్నారు. దాని ఖర్చు 17,000 రూపాయలు.అంటే నెలకు ఐదు లక్షల రూపాయలు బిస్కెట్ల కోసం ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఒకరు ట్విట్ చేశారు. ఈ ట్వీట్ ను వైసీపీ శ్రేణులు వైరల్ చేశాయి. దీంతో పెద్ద దుమారమే రేగింది.

    * రంగంలోకి ఏపీ ఫ్యాక్ట్ చెక్
    లోకేష్ ను కార్నర్ చేసుకొని ఆరోపణలకు దిగుతుండడంతో..వెంటనే ట్విట్టర్ వేదికగా ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. అది తప్పుడు ప్రచారంగా తేల్చింది.’ ఏపీ మంత్రి నారా లోకేష్ స్నాక్స్, ఈ ఖర్చులంటూ కొందరు ఇటువంటి ఫేక్ పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఇదంతా పూర్తిగా అసత్య ప్రచారం. ప్రజలు వీటిని నమ్మొద్దు. ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టినా, షేర్ చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి ‘ అంటూ ట్వీట్ చేశారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ బృందం అప్రమత్తం చేసింది.

    * తండ్రి కుమారులపై దుష్ప్రచారం
    ఇంకోవైపు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ లపై మరోరకంగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరి స్నాక్స్ కోసం ప్రభుత్వం ఏకంగా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపైన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్స్ స్పందించింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రజలు ఇటువంటి పోస్టులను నమ్మవద్దని కూడా కోరింది. అటువంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.

    * వైసిపి వైఫల్యాలు బయటపడడంతో
    గత వైసిపి ప్రభుత్వ విధానాలను కూటమి ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ క్రమంలో వైఫల్యాలను బయటపెడుతోంది. అయితే దీనిని తట్టుకోలేని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రచారానికి తెర తీస్తున్నారు. కూటమిప్రభుత్వం ఏ వైఫల్యాలను బయటపెడుతోందో.. అదే వైఫల్యాలను టిడిపి వైపు ఆరోపిస్తూ వైసిపి ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ బృందం రంగంలోకి దిగుతున్నా అప్పటికే కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతోంది.