AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం ఏపీ దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రానికి ఇది బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే దీని ప్రభావం ఈ నెల 27 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఏపీలో చాలా జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. అయితే దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గా మారడానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు.
* ఈరోజు ఈ జిల్లాల్లో
ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో వర్షాలు పడతాయి. శుక్రవారం సైతం వర్షాలు కొనసాగుతాయి. ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 28 నుంచి మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది.
* పెరిగిన చలి తీవ్రత
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గుముఖం పట్టాయి. ఏజెన్సీలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత తగ్గింది. సాయంత్రం నాలుగు గంటలకే పొగ మంచు ఆవహిస్తోంది. ఉదయం 10 గంటల వరకు దాని తీవ్రత కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చిన్నపాటి గాలులు వీస్తున్నాయి. దానికి చలి తోడు కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.