Heavy Rain Allert : వర్షం అంటేనే తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలకు విజయవాడ నగరంతో పాటు తెలంగాణలోని ఖమ్మం కూడా పూర్తిగా నీట మునిగింది. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇంకా ముంపు బారినే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ప్రభుత్వాల సహాయ చర్యలు, స్వచ్ఛంద సంస్థల సేవలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఇంకా భయం మాటునే గడుపుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించింది.ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయుగుండం గా మారుతుందని పేర్కొంది.దీంతో మళ్లీ ఆందోళన ప్రారంభమైంది.ఇప్పుడిప్పుడే వరద తీవ్రత నుంచి ఏపీ బయటపడుతోంది.విజయవాడలో సాధారణ పరిస్థితిలు నెలకొంటున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం విశేషం.
* ప్రభావం అంతంత మాత్రమే
వాయుగుండం గా మారనున్న ఈ అల్పపీడనం ఏపీ పై ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ దాని ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కృష్ణ, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు గాని వరదలు పెరిగితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
* జిల్లాలకు వర్ష సూచన
అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతం అయ్యింది. చాలాచోట్ల మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
* ప్రజల్లో ఆందోళన
భారీ వరదలతో విజయవాడ నగరానికి నష్టం జరిగింది. దశాబ్దాల చరిత్రలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బిక్కు బిక్కు మంటూ గడిపారు. మరోసారి ఇప్పుడుఅల్పపీడనమని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.