Mekapati Rajmohanreddy: జగన్ ఈగోను హర్ట్ చేసిన మేకపాటి.. వైసీపీలో కొత్త ట్విస్ట్

రాజకీయాల్లో జగన్ వెంట నడిచిన కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి. జగన్ ఆత్మీయులుగా గుర్తింపు పొందారు. జగన్ సైతం వారికి అదే గుర్తింపు ఇచ్చారు. కానీ తాజాగా జగన్ ఆదేశాలను పట్టించుకోలేదు మేకపాటి.

Written By: Dharma, Updated On : September 18, 2024 4:59 pm

Mekapati Rajmohanreddy

Follow us on

Mekapati Rajmohanreddy: వైసిపి అధినేత జగన్ ది వింత మనస్తత్వం. అది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఆయనలో పట్టుదల కూడా ఎక్కువే. ఆ పట్టుదలే ఆయనకు అందలం ఎక్కించింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది.కానీ అన్నివేళలా ఆ మొండి పట్టుదల పనిచేయదు. అందున ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురయ్యేసరికి అదే స్థాయిలో పట్టుదల ప్రదర్శించడం అంటే కుదరదు.2014 నుంచి 2019 మధ్య ప్రధాన ప్రతిపక్షంగా.. 2019 నుంచి అధికారపక్షంగా కొనసాగే వారు.పార్టీ శ్రేణులు సైతం సమన్వయంతో ఉండేవి. అధినేత అంటే గౌరవం,అభిమానం,భయంతో నేతలు ఉండేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసిపి ప్రభుత్వం పాలనా వైఫల్యం వల్లే ప్రజలు పక్కన పెట్టారు. జగన్ ను తిరస్కరించారు.అందుకే ఇప్పుడు పార్టీలోని అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి.అధినేత ఆదేశాలను సైతం ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక రకమైన భిన్న వాతావరణం వైసీపీలో కనిపిస్తోంది.

* వరద బాధితుల సహాయం లో కనిపించని వైసిపి
విజయవాడకు వరదలు ముంచేత్తాయి. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తరుపున సహాయక కార్యక్రమాలు చేపట్టారు.బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. అటు జగన్ సైతం రెండుసార్లు విజయవాడ వరద బాధితులను పరామర్శించారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం పర్యటించారు. అయితే ఎక్కడికి అక్కడే రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు.వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా సహాయ చర్యల్లోపాల్గొన్న దాఖలాలు కనిపించలేదు.చాలామంది పార్టీ నేతలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.వరద బాధితులను పరామర్శించడంలో సైతం పెద్దగా సుముఖత చూపలేదు.

* సీఎం సహాయ నిధికి అందించకుండా
సాధారణంగా విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎక్కువమంది విరాళాలు అందిస్తారు. ప్రభుత్వం తరఫున ఖర్చు చేయాలని సూచిస్తారు. నేరుగా సీఎంకు చెక్కులు అందిస్తారు.జగన్ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రం అందించలేదు.నేరుగా తానే నిత్యవసరాలు అందిస్తానని చెప్పుకొచ్చారు. రెండు ఆటోలతో సరుకులు తీసుకొచ్చి పంపిణీ చేశారు. దానినే కోటి రూపాయలుగా చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు సైతం వరద బాధితుల సహాయార్థం సాయం చేయాలని కోరారు. కానీ అది ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

* నేరుగా సాయం కొంతమందికే
వాస్తవానికి నేరుగా సాయం చేస్తే బాధితులకు న్యాయం జరగదు. కొద్ది మందికి మాత్రమే నిత్యవసరాలు అందుతాయి. అందుకే ఎక్కువమంది సీఎం సహాయ నిధికి తమ విరాళాలను అందిస్తారు. అయితే ప్రస్తుతం వ్యతిరేక ప్రభుత్వం ఉండడంతో వైసిపి నేతలు ఎవరు విరాళాలను సీఎం సహాయ నిధికి అందించవద్దని ఆదేశించినట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ ఆదేశాలను బేఖాతరు చేశారు. సీఎం సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు అందించారు. అయితే తాను వెళ్లకుండా పోస్టల్ ద్వారా చెక్కును పంపించారు. తెలంగాణలో మాత్రం అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా కలిసి అందించారు. దీంతో రాజమోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఆయనపై జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాలి.