Kodali Nani: వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా నిలిచారు కొడాలి నాని, వల్లభనేని వంశీ. టిడిపిలో ఉంటూ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకిస్తూ వైసీపీలోకి చేరారు. వైసీపీలో ఎనలేని ప్రాధాన్యం దక్కించుకున్నారు. కొడాలి నాని అయితే మంత్రి పదవి కూడా చేపట్టారు. తనకు గుడివాడలో తిరుగు లేదని భావించారు. తనపై గెలవాలని రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేసేవారు. ఇక వల్లభనేని వంశీ గురించి చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికల్లో సైతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ వైసీపీలోకి ఫిరాయించారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. కొడాలి నాని గురించి చెప్పనవసరం లేదు. శాసనసభలోనైనా, బయటయినా.. వేదిక ఏదైనా తనదైన శైలిలో చంద్రబాబుపై విరుచుకుపడేవారు. వ్యక్తిగత దూషణలు చేసేవారు. అయితే ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు దారుణంగా ఓడిపోయారు. తరువాతసైలెంట్ అయ్యారు. ఎక్కడా వారు నోరు తెరవడం లేదు.కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు.
* కౌంటింగ్ నాటి నుంచి కనిపించని వంశీ
వల్లభనేని వంశీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కనిపించారు. భారీ ఓటమి ఎదురయ్యేసరికి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. అటు తరువాత ఆయన బయటకు కనిపించలేదు. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని అడపాదడపా కనిపించారు. పార్టీ అధినేత జగన్ తో సమావేశం అయ్యారు. ఇటీవల మాత్రం నాని కనిపించడం లేదు. సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడడం లేదు. అయితే వ్యూహాత్మకంగానే పార్టీ వారిని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
* వరద సహాయ చర్యల్లో సైతం ముఖం చాటేశారు
ఇటీవల కృష్ణాజిల్లాను వరదలు ముంచెత్తాయి. ఈ ఇద్దరు నేతలు అదే జిల్లాకు చెందినవారు. కానీ వరద సహాయ చర్యల్లో పాల్గొనలేదు. ప్రభుత్వ వరద సాయం పై విమర్శలు చేయలేదు. కనీసం సొంత నియోజకవర్గాలకు కూడా రాలేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. కనీసం ఈ సందర్భంలోనైనా స్పందించకుండా కొడాలి నాని సైలెంట్ గా ఉండడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ పై కేసులు నమోదయ్యాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్టుల వరకు లేకుండా తప్పించుకున్నారు.
* రాజకీయాలకు దూరం?
అయితే ఇద్దరు నేతల వ్యవహార శైలి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. పార్టీలోనూ పెద్దగా యాక్టివ్ గా లేరు. సొంత నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు. దీంతో వీరు రాజకీయాలకు దూరమవుతారా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. పోనీ పార్టీ మారుతారు అంటే.. ఏ పార్టీ కూడా చేర్చుకునే అవకాశం లేదు. అందుకే కొద్దిగా కాలం పాటు సైలెంట్ గా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హై కమాండ్ సైతం వీరిద్దరిని నియంత్రించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియాలి.