Naga Babu joins Union Cabinet: ఏపీలో( Andhra Pradesh) శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. రాజకీయంగా పట్టు బిగించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ ఆ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే పాలనాపరంగా చంద్రబాబు బిజీగా ఉండగా.. కూటమికి రాజకీయ రక్షణగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. అందుకే విదేశీ పర్యటనలతో పాటు పెట్టుబడుల అన్వేషణ, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన గ్రామీణ శాఖలతో పాటు రాజకీయపరమైన అంశాలకు పరిమితమవుతున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుండడం అనేక రకాల చర్చ నడుస్తోంది. ఈరోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో పాటు రైల్వే శాఖ మంత్రి వైష్ణవును కలుసుకోనున్నారు పవన్. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి చేయడం, కూటమిపరంగా రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ..
ఈ ఏడాది జూన్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. అయితే ఆ నాలుగు స్థానాలు టిడిపి కూటమికి దక్కుతాయి. గతంలో రెండు సార్లు రాజ్యసభ పదవులకు ఖాళీ ఏర్పడింది. టిడిపి తో పాటు బిజెపి ఆ పదవులను దక్కించుకుంది. జనసేనకు వివిధ సమీకరణలో భాగంగా చాన్స్ లేకుండా పోయింది. జనసేనకు ఇంతవరకు రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. ఈసారి రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో ఇదే విషయం చర్చిస్తారని తెలుస్తోంది. రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి తమ పార్టీకి ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టనున్నట్లు సమాచారం.
నాగబాబుకు ఛాన్స్
ఒకవేళ జనసేనకు( janasena ) రాజ్యసభ తో పాటు మంత్రి పదవి వస్తే ఎవరికి ఇస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇప్పటికే జనసేనకు ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు. మచిలీపట్నం నుండి వల్లభనేని బాలశౌరి ఉన్నారు. కేంద్ర క్యాబినెట్లో జనసేనకు అవకాశం ఇస్తే ఆయన పేరును పరిశీలించే అవకాశం ఉంది. అయితే మెగా బ్రదర్ నాగబాబుకు కేంద్ర రాజకీయాలు అంటే ఇష్టం. రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టాలని ఆలోచన ఉండేది. ఆ ఛాన్స్ రాకపోయేసరికి సీఎం చంద్రబాబు గత ఏడాది నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ అయ్యారు కానీ ఏడాది అవుతున్న మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు జనసేనకు రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తే నాగబాబుని పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. దానిపై కూడా పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అమిత్ షా తో చర్చిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.