Vizag MP Family Kidnap : విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ లో పాత్రధారులే పట్టుబడ్డారా? సూత్రధారులు ఉన్నారా? తెర వెనుక ఉండి వారు నాటకం ఆడించారా? వీరు రాజకీయ ప్రత్యర్థులా? లేకుంటే వ్యాపార రంగంలో ఉన్నవారా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. కిడ్నాప్ నకు గురైంది సాక్షాత్ ఎంపీ కుమారుడు, భార్య, సన్నిహితుడైన ఆడిటర్. ముందుగా కుటుంబసభ్యులు, తరువాత తన వ్యాపార లావాదేవీలు చూసే ఆడిటర్. సహజంగానే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినదని తెలుస్తున్నా… అది వ్యాపార సంబంధమైనదిగా కూడా భావించవచ్చు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బిగ్ షాట్. ఏపీలోనే ఒన్ ఆఫ్ ది బిల్డర్. రాజకీయంగా కూడా దూకుడుగా ఉన్నారు. సహజంగానే ఆయనకు ప్రత్యర్థులు ఉంటారు. వారే ఈ పనికి పురిగొలిపి ఉండవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంపీకి చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీల్లో తేడావచ్చిన వారే కిడ్నాపర్లను ముందుపెట్టి కథ నడిపించి ఉండవచ్చు కదా అని పోలీస్ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇలా టార్గెట్ చేసిన వారు ఏ రంగానికి చెందిన వారు అన్నది పోలీసులే సమగ్ర దర్యాప్తు చేసి తేల్చాలి.
ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఒక సంచలనం అయితే.. దానిని త్వరితగతిన ఛేదించి సేఫ్ గా కిడ్నాపర్ల చెర నుంచి బందీలను విడిపించడం సుఖాంతమైంది. కానీ ఈ మిస్టరీ అలానే కొనసాగుతోంది. ఎంపీ కుటుంబ సభ్యుల మెడపై కత్తిపెట్టి, విచక్షణరహితంగా కొట్టడానికి కిడ్నాపర్లకు అదృశ్య వ్యక్తులు శక్తి అంది ఉంటుంది. వారు ఎవరన్నది ఇప్పుడు తెలియాలి. అయితే కిడ్నాప్ నకు గురైంది అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు. సహజంగానే ఇది శాంతిభద్రతల సమస్య. ఇది ప్రభుత్వానికి మాయని మచ్చ. అందుకే తెరవెనుక ఉన్న సూత్రధారులను బయటకు తీసే పనిని పోలీస్ శాఖ తాత్కాలికంగా పక్కన పడేసిందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.