AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో హామీల అమలుపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఇప్పటికే బుకింగ్ ప్రారంభించింది. ఇక మరో కీలక హామీ ఉద్యోగాల భర్తీ. దీనితో యువతలో నెలకొన్న నైరాష్యాన్ని తొలగించవచ్చన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీతోపాటు, ఇతర శాఖల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేపట్టింది. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ–2024పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో టెట్ నిర్వహించింది. ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 6న నోటిఫికేషన్ ఇచ్చేలా కసర్తు చేస్తోంది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.
నవంబర్ 2న టెట్ ఫలితాలు..
డీఎస్సీకి టెట్ క్వాలిఫై కావాలి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన టెట్ ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయాలని విద్యాశాక నిర్ణయించింది. టెట్ ఫలితాలు విడుదల చేసిన మరుసటిరోజే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే 3వ తేదీ ఆదివారం క ఆవడంతో 6వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రోస్టర్ వివరాలు సేకరిస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన మూడు నుంచి నాలుగు నెలల్లో నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నాటికి..
తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయ్యే ఉపాధ్యాయులకు వేసవిలో పోస్టింగ్ ఇచ్చి.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధుల్లో జాయిన్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త టీచర్లు వస్తే ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ స్కూళ్ల ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఏపీలో దాదాపు 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. టీచర్ సెలవు పెడితే బడి మూసేయాల్సిన పరిస్థితి. ఈ నపథ్యంలో రెండో టీచర్‌ను నియమించే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
తాజాగా ఇచ్చే డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులు ఉన్నాయి. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీలు)–1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీలు)–286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీలు) 132 ఉద్యోగాలు ఉన్నాయి.