Undavalli Case Against Margadarsi: అప్పట్లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి సంస్థల మీద ఏపీ సిఐడి దాడులు చేసింది. చిట్స్ సేకరించకుండా ఆంక్షలు విధించింది. ఏకంగా రామోజీరావును ప్రశ్నించింది. తన అచంచలమైన సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా.. గొప్ప గొప్ప నేతలు మొత్తం తన వద్దకు వచ్చేలా చేసుకున్న రామోజీరావుకు.. జగన్మోహన్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాదు ఏపీ సిఐడి అధికారులను రామోజీరావు ఇంటికి పంపించి విచారణ కూడా చేయించారు. అప్పట్లో విచారణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టించాయి. ఒకానొక సందర్భంలో మార్గదర్శి మూతపడుతుంది అనే విధంగా అప్పటి వైసిపి నేతలు ప్రచారం చేశారు. సిఐడి అధికారుల అడుగులు కూడా అదే విధంగా ఉండేవి.
Also Read: రాహుల్ గాంధీ నాయకత్వంపై సడలుతున్న విశ్వాసం
వాస్తవానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 లో మార్గదర్శి సంస్థ మీద అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్గదర్శి పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న రామోజీరావు.. వివిధ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని.. ఇది చట్టరీత్యా నేరమని.. ఆయన పబ్లిక్ ఇష్యూ కి వెళ్లకుండా.. హిందూ అవిభాజ్య విధానంలో వ్యాపారాలు సాగిస్తున్నారని.. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని.. కేంద్రీకృత బ్యాంకు నిబంధనలు పట్టించుకోకపోవడం దారుణమని ఉండవల్లి అరుణ్ కుమార్ తన వాదనలను న్యాయవాది ద్వారా వినిపించారు. అయితే అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగుతూనే ఉంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
మార్గదర్శి ప్రజల నుంచి చిట్స్ వసూలు చేస్తున్న విషయం వాస్తవం. కాకపోతే వసూలు చేసిన చిప్స్ ను సకాలంలో చెల్లించడం మార్గదర్శి సంస్థ కు ఉన్న ఒక మంచి లక్షణం. అందువల్లే ఆ సంస్థలో చాలామంది చిట్స్ వేస్తుంటారు.. పైగా రామోజీ ఏర్పాటు చేసిన కంపెనీలలో అధికంగా లాభాలు అందించే సంస్థగా మార్గదర్శి ఉంది. అందువల్లే ఈ సంస్థపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దృష్టి సారించారు. రామోజీ గ్రూప్ సంస్థలకు ఈ సంస్థ నుంచి నిధులు రాకుండా అడ్డుకట్ట వేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు రామోజీరావు నిలువరించుకుంటూనే వస్తున్నారు. కాకపోతే జగన్ వ్యవహార శైలి వల్ల రామోజీరావు కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇప్పుడు జగన్ అధికారంలో లేడు.. పైగా మార్గదర్శి వ్యవహారాలు దర్జాగా కొనసాగుతూనే ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయవాది వాదనలలో పస లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read: రాహుల్ గాంధీతో చేతులు కలిపిన జగన్?
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక రకంగా మార్గదర్శి యాజమాన్యానికి హర్షం కలిగిస్తే.. ఉండవల్లి అరుణ్ కుమార్ కు మాత్రం ఇబ్బంది కలిగించింది. సుదీర్ఘకాలం మార్గదర్శి మీద పోరాడుతూ వస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ కేసులో తర్వాత ఏం చేస్తారు.. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారా.. లేదా మరో విధంగా ప్రయత్నిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి గత ఐదేళ్లు తీవ్ర ఉక్కపోతను మార్గదర్శి ఎదుర్కొంది. ఇప్పుడు ఇక తెలంగాణ హైకోర్టు కూడా అనుకూల తీర్పు ఇవ్వడంతో సజావుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనుంది.