AP Cabinet: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత ఇచ్చారు. అమరావతి లో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. పలు చట్ట సవరణలకు సైతం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అదే సమయంలో విశాఖలో ప్రధాని పర్యటనపై సమావేశంలో చర్చించారు. డీఎస్సీ నియామకంపై కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టి సారించారు. వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అమలు చేయాలని.. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ తో పాటు ఆర్థిక శాఖకు క్యాబినెట్ ఆదేశించింది. మరోవైపు డీఎస్సీ నియామక ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం విషయంలో కూడా ఒక స్పష్టతకు వచ్చారు. వచ్చే నెలలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల తర్వాత వెంటనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
* రెవెన్యూ సమస్యలపై ఉప సంఘం
ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా రెవెన్యూ శాఖపై కూడా చర్చ నడిచింది. రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు చర్చకు వచ్చాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 2733 కోట్ల రూపాయల పనులకు క్యాబినెట్ ఆమోదించింది. అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల పనులతో పాటు భవనాలు, లేఅవుట్ అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనను కూడా ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్.
* ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఇక డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్. అక్కడ 19 నూతన పోస్టులకు అనుమతి ఇచ్చింది. అలాగే తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనను అంగీకారం తెలిపింది. రామయ్య పట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదించింది. ఈనెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆర్థిక శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం విశేషం.