Earthquake in AP : ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రజలకు భయాందోళనకు గురిచేసింది. ప్రకాశం జిల్లా మండ్లమూరులో భూప్రకంపనలు వచ్చాయి. మధ్యాహ్నం 1.45 సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. భూకంపానికి కారణాలను అన్వేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల కారణాలను కూడా చెప్పుకొచ్చారు. గుండ్ల కమ్మ నది పరివాహక ప్రాంతం కావడం వల్లనే భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని.. దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వరుస భూప్రకంపనలతో ప్రజలు భయపడుతున్నారు.
* పది రోజుల కిందట
ప్రకాశం జిల్లాలో వరుస పెట్టి భూప్రకంపనలు వెలుగులోకి వస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పది రోజుల కిందట ఇదే తరహా భూప్రకంపనలు వచ్చాయి. దర్శి నియోజకవర్గంలో సైతం ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం అందరూ ఉండగా భూమి షేక్ అయింది. దీంతో వెంటనే ప్రజలు పరుగులు తీశారు. కొద్ది రోజుల కిందట తాళ్లూరు మండలం పోలవరం, శంకరాపురం, తూర్పు కంభంపాడు, వేంపాడు, మారెళ్ళ, పసుపుగల్లు తదితర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో ఇళ్లల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. విద్యార్థులైతే పాఠశాలను విడిచిపెట్టారు. ఆరుబయట తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఒకే మండలంలో
అయితే వరుసగా మండ్లమూరు మండలంలోని వరుసగా భూప్రకంపనలు వెలుగులోకి వస్తుండడం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. జనాలు టెన్షన్తో బాధపడుతున్నారు. డిసెంబర్ 23న వరుస పెట్టి మూడు రోజులపాటు ఆ మండలంలో ప్రకంపనలు వచ్చాయి. మళ్లీ ఈరోజు తాజాగా ప్రకంపనలు రేగాయి. దీంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కొన్నిచోట్ల భవనాలకు బీటలు వారడం, స్తంభాలపై అడ్డుగా గీతలు పడడం వంటివి కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఒక రకమైన భయాందోళన నెలకొంది.