Eluru District: కూతురు అంటే ప్రతీ తండ్రికి ప్రాణం. ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్నా.. తండ్రి మాత్రం కూతురును తన కన్న తల్లిలా భావిస్తారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేస్తారు. అడిగింది కాదనకుండా ఇస్తాడు. కూతురి కంట చెమ్మ చూడడానికి కూడా ఇష్టపడడు. ఇదంతా కూతురుపై తండ్రికి ఉన్న ప్రేమ. తన కూతురు గురించి అన్నీ తనకే తెలుసని, తాను తప్ప ఇంకెవరూ ఆమెను బాగా ప్రేమించలేరని భావిస్తాడు. అందుకే పెళ్లి కూడా తాను చూసిన అబ్బాయినే చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ నేటి తరం అలా లేదు. తండ్రి ప్రేమను తండ్రిపై చూపుతూనే వైవాహిక జీవితానికి మరో ప్రేమను వెతుక్కుటోంది. అయితే కూతురు ఎదిగే కొద్ది తండ్రిలో భయం మొదలవుతుంది. ప్రేమ పేరుతో తన కూతురు ఏ కసాయి వాడిని నమ్ముతుందో అన్న ఆందోళన ప్రతీ తండ్రిలో ఉంటుంది. ఇక 20 ఏళ్ల కన్నతండ్రి ప్రేమను కాదని ఏడాది పరిచయం ఉన్న యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే సహించలేడు. ఇలాంటి ఘటనలు ఇంకా సమాజాంలో జరుగుతున్నాయి. కులం ఒక అడ్డుగోడ అయితే, తనలా పెళ్లి చేసుకున్నవాడు చూసుకుంటాడో లేదో అన్న ఆందోళన మరొకటి. అందుకే ప్రేమ విషయం తెలియగానే తన మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరైతే కూతురును ప్రేమించిన యువకుడిపై దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అలాగే చేశాడు ఇక్కడ ఓ తండ్రి.
ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఓ తండ్రి తన కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో యువకుడి ఇంటిపై దాడిచేశాడు. అల్లుడు అని కూడా చూడకుండా అతనిపై కత్తి దూశాడు. ఈ ఘటన నూజివీడు నియోజకవర్గం అరిగిపల్లి మండలం సీతారామపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కందుల వంశీ, అత్తి శ్రావణి కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కోపంతో రగిలిపోయాడు. బంధువలతో కలిసి వంశీ ఇంటికి వెళ్లి దాడిచేశాడు. పదునైన ఆయుధంతో వంశీపై విరక్షణారహితంగా దాడిచేసి గాయపర్చాడు.
కేసు నమోదు..
ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వంశీని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వంశీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రావణి తండ్రి, ఇతర బంధువులపై కేసు నమోదు చేశారు.
ప్రాణభయం ఉందని ఫిర్యాదు..
ఇదిలా ఉండగా వంశీ, శ్రావణి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు. అయితే ఇద్దరూ మేజర్లు కావడంతో ఈనెల 8న ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. తర్వాత పోలీసులను ఆశ్రయించారు. తమకు పెద్దల నుంచి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రుల నుంచి రక్షించాలని శ్రావణి కోరింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా శ్రావణి తండ్రి తీరు మారలేదు. చివరకు అల్లుడిపై దాడి చేసి కూతురును బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Man attacked after love marriage with girl friend in eluru
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com