Malla Reddy University: పూలమ్మినా… పాలమ్మినా.. కాలేజీ పెట్టినా.. అంటూ తనదైన శైలి ప్రంగం.. వివిధ కార్యాక్రమాల్లో ఉత్సాహ పరిచే వ్యక్తిత్వంతో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు చామకూర మల్లారెడ్డి. ప్రజాప్రతినిధిగా, మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తన విద్యాసంస్థల ద్వారా మల్లారెడ్డికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంతకాలం తెలంగాణకే పరిమితమైన తన విద్యాసంస్థలను ఇక ఏపీకి విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి సాధించారు. యూజీసీ చట్టం ప్రకారం ఈ ఆఫ్–క్యాంపస్ విశ్వవిద్యాలయం స్థాపనకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో విద్యా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.
రేణిగుంట పరిధిలో క్యాంపస్ నిర్మాణం
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో ఈ విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. ఇంతకుముందే ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాలను కొనుగోలు చేసి, దానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి, కేంద్ర నియమాలకు అనుగుణంగా దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది.
తెలంగాణలో విస్తృతమైన విద్యా నెట్వర్క్..
తెలంగాణలో మైసమ్మగూడ వద్ద లక్షలాది విద్యార్థులకు చదువు అందిస్తున్న మల్లారెడ్డి సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టడం ద్వారా రాయలసీమ విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించనున్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య విద్యా సహకారానికి మార్గం సుగమం చేస్తుంది.
ఆధునిక కోర్సులు, పరిశోధనా కార్యక్రమాలు
రాబోయే విద్యా సంవత్సరం నుంచి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పరిశోధనా కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతిక విభాగాలు, నిర్వహణ రంగంలోని అధ్యయనాలకు సీట్లు భర్తీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతి..
తిరుపతిలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయస్థాయి సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు రేణిగుంట పరిసరాల్లో పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో ఈ కొత్త డీమ్డ్ విశ్వవిద్యాలయం రావడంతో ఆ ప్రాంతం విద్యా కేంద్రంగా మరింత బలపడనుంది. మోహన్ బాబు స్థాపించిన విశ్వవిద్యాలయం ఆధిపత్యానికి మల్లారెడ్డి యూనివర్సిటీతో చెక్ పడుతుందని భావిస్తున్నారు.
