Mahanadu event changes for PM Modi: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ పండుగకు సమీపిస్తోంది సమయం. మహానాడు నిర్వహణకు సంబంధించి స్వల్ప మార్పు చేసింది టిడిపి నాయకత్వం. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి నాడు పార్టీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఉత్తరాంధ్రలో నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావించింది. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తామని పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. స్థల పరిశీలన కూడా చేసింది. కానీ ఇప్పుడు మార్పు అనివార్యం అని తెలుస్తోంది. జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉంది. అంతకు కొద్ది రోజుల ముందే మహానాడు నిర్వహించడంతో.. ప్రధాని పర్యటనకు అంత హైప్ రాదని భావించింది టిడిపి హై కమాండ్. అందుకే మహానాడు ను వేరే ప్రాంతంలో నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చి ఏర్పాట్లు ప్రారంభించింది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఒక కొలిక్కి వచ్చింది. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఎయిర్పోర్టును జూన్ లోకాని జూలైలో కానీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ దృష్ట్యా.. మహానాడు నిర్వహణ అంత శ్రేయస్కరం కాదు అని టిడిపి హై కమాండ్ భావించింది. అందుకే మహానాడు ను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు షిఫ్ట్ చేసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో టిడిపి నాయకత్వం నిమగ్నం అయ్యింది. ఒకే ప్రాంతంలో రెండు భారీ కార్యక్రమాల నిర్వహణ అనేది సమంజసం కాదు అని భావించి శ్రీకాకుళం నుంచి మహానాడు ను.. నెల్లూరుకు తరలించింది.
దక్షిణ కోస్తాలో బలం చాటుకునేందుకు..
నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన మూడు ఎన్నికల్లో.. రెండుసార్లు ఆ జిల్లాలో గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కూటమి స్వీప్ చేసింది. అదే బలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి అంటే మహానాడు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నెల్లూరులో మహానాడు నిర్వహించడం ద్వారా దక్షిణ ఆంధ్రాలో క్యాడర్లో మరింత ఉత్సాహం నింపాలని చూస్తోంది నాయకత్వం. ఇప్పటికే దీనిపై పార్టీ నేతలకు ప్రాథమిక ఆదేశాలు వెళ్లాయి. నేతలు ఏర్పాట్లలో నిమగ్నమం అయ్యారు.