Nara Lokesh : వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపూ ఉండదు. గత నాలుగేళ్లలో చాలా సందర్భాల్లో దీనిని చూశాం. మంత్రుల నుంచి కిందిస్థాయి నేతల వరకూ అనుచిత వ్యాఖ్యలు షరా మామ్మూలే. రాజకీయ ప్రత్యర్థులే కాదు..చివరకు తీర్పు చెప్పే న్యాయమూర్తుల వరకూ అందరూ బాధితులే. సోషల్ మీడియా ద్వారా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించే క్రమంలో అడ్డగోలు మాటలు, అనుచిత వ్యాఖ్యలకు బాగా అలవాటు పడ్డారు. చిన్నపాటి విమర్శలను సైతం సహించలేక సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడడం వారికి అలవాటైన విద్యగా మారిపోయింది. అటువంటి వారంతా ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై ఆల్ మోస్ట్ వైసీపీ నేతలంతా విరుచుకుపడతారు. కొందరైతే వ్యక్తిగతంగా కామెంట్లు చేసిన సందర్భాలున్నాయి. అటువంటి నేతల్లో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ముఖ్యులు. ఇందులో దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కూడా ఉన్నారు. గతంలో వీరు లోకేష్ ను ఉద్దేశించి చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై లోకేష్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై సంజాయిషీ ఇచ్చేందుకు ఇరువురు నేతలు ఇప్పుడు స్వయంగా హాజరుకావాల్సి వస్తోంది.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆ మధ్యన కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆవిడ లోకేష్ మూలంగానే ఆత్మహత్య చేసుకున్నారని దేవేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లోకేష్ తో ఉన్న భూ వివాదం కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారని.. ఫేక్ సర్వే నంబర్లతో సహ వివరాలను పొందుపరిచారు. వాటిని డిలీట్ చేసి హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడుల విషయంలో తేడా వచ్చినందునే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని మరో పోస్టు పెట్టారు. అప్పట్లో ఇవి వైరల్ అయ్యాయి. లోకేష్ ను డ్యామేజ్ చేశాయి.
ఎమ్మెల్సీ పోతుల సునీత ఇదే విధంగా చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ రూపంలో సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అక్కడితే ఆగకుండా భువనేశ్వరి, బ్రాహ్మణిలు కొట్టుకున్నారని.. లోకేష్ కు మందు, మగువ లేనిదే ఉండలేరని ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేష్ లు మందు తాగనిదే వారి మాట పెగలదని కూడా కామెంట్స్ చేశారు. దీనిపై సాక్షాధారాలతో లోకేష్ కోర్టులో ఫిర్యాదుచేశారు. దీనికి స్పందించిన న్యాయస్థానం స్వయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది.