CM KCR Grandson Himanshu: “నేను మొదటిసారి ఈ స్కూల్ ను సందర్శించినప్పుడు చాలా బాధనిపించింది. కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. బాలికల కోసం కనీసం బాత్రూంలు కూడా లేవు. పిల్లలు రాళ్లల్లో ఆడుకుంటున్నారు. వారిలో ఒక పిల్లాడు నేను వెళ్ళిన రోజే గాయపడ్డాడు. ఇవన్నీ చూసి ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నాను.” ఇవేవో ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పిన మాటలు కాదు. ఈరోజు గౌలి దొడ్డిలోని కేశవ నగర్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన తర్వాత కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు రావు చెప్పిన మాటలు. అక్కడే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. పేరు పొందిన భారత రాష్ట్ర సమితి నాయకులు ఉన్నారు. అన్నట్టు ఈ గౌలిదొడ్డి ఎక్కడో ఆదిలాబాద్ లోనో, నల్లగొండ జిల్లాలోనో లేదు. కేటీఆర్ పదేపదే ప్రచారం చేస్తున్న హైదరాబాద్ మహానగరంలో ఉంది.
సౌకర్యాలు లేవు
కల్వకుంట్ల హిమాన్షు రావు చెప్పినట్టు.. తెలంగాణలో కేవలం గౌలి దొడ్డి పాఠశాల మాత్రమే కాదు మిగతా పాఠశాలల పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల సర్కారు విద్యాలయాల్లో సమస్యలు అలాగే ఉన్నాయి. స్వరాష్ట్రంలోనూ ఈ పరిస్థితి మారకపోవడంతో చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. పేరుకు ప్రభుత్వం గురుకులాలను తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ.. అందులో 99 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ అద్దె భవనాలకు చెల్లించే సొమ్ముతో సొంత భవంతులు కట్టవచ్చు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ నిధుల మంజూరు లేక ఈ పథకం అంతంత మాత్రం గానే సాగుతోంది. కేటీఆర్ సారథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో ఈ పథకం పనులు 31 శాతం మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కంపు కొడుతున్నాయి
హిమాన్షు రావు చెప్పినట్టు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కంపు కొడుతున్నాయి. నేటికీ అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. గురుకులాలు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మిగతా పాఠశాలల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొన్ని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా మూత్రశాలలు లేవంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి మురళి భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలను సందర్శించారు. కొన్ని పాఠశాలల్లో అయితే కనీసం కూర్చునేందుకు బల్లలు కూడా లేవు. కొన్నిచోట్ల పాఠశాల భవనాలకు సంబంధించిన స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ముఖ్యమంత్రి మనవడు కాబట్టి..
గౌలిదొడ్డి పాఠశాలకు సంబంధించి హిమాన్షు రావు మంచి ప్రయత్నమే చేశారు. ఈ పాఠశాలలో విపరీతంగా మొక్కలు నాటారు. దాదాపు కోటి రూపాయలతో మరమ్మతులు చేపట్టారు. ఇందులో 45 లక్షలు తన స్నేహితులతో కలిసి పోగు చేయగా.. మిగతా నగదు సి ఎస్ఆర్ ద్వారా సేకరించారు. కానీ ఇదే సిఎస్ఆర్ ఫండ్స్ పాఠశాలలకు ఎందుకు దక్కడం లేదనేది ఇక్కడ ప్రశ్న. తెలంగాణ పారిశ్రామికపరంగా దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ పదేపదే చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బులు వివిధ రకాల సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పరిశ్రమలు చెల్లిస్తున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో అంతు పట్టకుండా ఉంది. ముఖ్యమంత్రి మనవడు పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి నిధులు ఇచ్చిన పారిశ్రామిక సంస్థలు.. మిగతా ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధ వహించడం లేదు.
ఇప్పటికైనా మార్చుతారా
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగింది. ఇందులో నియామకాలు దక్కాలి అంటే ఇక్కడి పిల్లలు సక్రమంగా చదువుకోవాలి. అంటే వారికి నాణ్యమైన విద్య అందాలి. ఆ నాణ్యమైన విద్య అందాలి అంటే పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి. 2014 నుంచి 2023 వరకు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ముఖ్యమంత్రి మనవడు చేసిన వ్యాఖ్యలతో అయినా దిగివస్తుందా? లేదా తనకు అలవాటైన రీతిగా ప్రచారానికి వాడుకుంటుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.