https://oktelugu.com/

Diamonds Hunting: అక్కడ వర్షాలు పడితే వజ్రాల వేట..

వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. ఇక్కడి వజ్రాల కోసం కర్నూలుతో పాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా వస్తుంటారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 7, 2024 11:31 am
    Diamonds Hunting

    Diamonds Hunting

    Follow us on

    Diamonds Hunting: రాయలసీమ.. ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసేవారిని మనం పుస్తకాల్లో చదివాం. ఆ ప్రాంతంలోని పెద్దలూ చెబుతుంటారు. రాయల వారి పరిపాలనలో ఈ ప్రాంతం సకల సంపదలతో తూలతూగింది. కాలక్రమేణా ఇప్పుడు ఆ ప్రాంతం కరువు కోరల్లోకి చిక్కుకుపోయింది. కానీ ఇప్పటికీ అక్కడ వజ్రాలు దొరుకుతుంటాయి. ఆ వజ్రాల వేట కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తిష్ట వేస్తుంటారు. కొందరు రెండు, మూడు నెలలపాటు ఇక్కడే ఉండి, తమ అదృష్టాన్ని వెతుక్కుంటుంటారు. అయితే వజ్రం దొరికినప్పటి నుంచి దాన్ని విక్రయించే దాకా అంతా గుట్టుగానే సాగుతుంది. పొరపాటున వజ్రం దొరికినట్లు పోలీసులకు గానీ అధికారులకు సమాచారం చేరిందా ఇక అంతే సంగతి. అదృష్టం కాస్త దురదృష్టంగా మారుతుంది.

    సీజన్ ప్రారంభం కాగానే వేట షురూ
    వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. ఇక్కడి వజ్రాల కోసం కర్నూలుతో పాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా వస్తుంటారు.
    తమ అదృష్టం మంచిగుంటే ఒక్క వజ్రం దొరికినా లైఫ్ సెటిల్ అవుతుందని ఎంతో మంది ఈ వజ్రాల వేటకు వెళ్తుంటారు. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో ఎంతో మందికి వజ్రాలు దొరికాయనే వార్తలు కూడా వచ్చాయి.
    ఓ వ్యక్తికి వజ్రం దొరికిందంటూ చర్చ
    ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలోని రైతుల పొలాల్లో వజ్రాల వేట ప్రారంభమైంది. కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి తదితర ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పత్తికొండకు చెందిన ఓ వ్యక్తికి ఆ అదృష్టం కలిసివచ్చింది. రూ. 10 లక్షల విలువైన వజ్రం లభించగా, జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ. 2 లక్షల నగదు రెండు తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతున్నది.

    పొలాల్లో హెచ్చరిక బోర్డులు
    ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయని తెలియడంతో జనం వందల సంఖ్యలో తుగ్గలి, జొన్నగిరి తదితర ప్రాంతాల్లోని పంట భూముల్లో వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే భూముల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న మాకు దొరకని వజ్రాలు ఇతరులకు ఎలా దొరుతాయని ప్రశ్నిస్తున్నారు. వేట కోసం వచ్చే వారి వల్ల తమ పంట పొలాలు పాడైపోతున్నాయని, ఏటా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటను నివారించేందుకు పొలాల్లో హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వజ్రాల కోసం తమ పొలాల్లోకి అడుగు పెడితే కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు.