Local Body Elections In AP: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోతాయా? షెడ్యూల్ ప్రకారం జరిగే పరిస్థితి లేదా? అందుకు జన గణన కారణమా? పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనగణన తరువాత ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది జరిగే అవకాశం లేదని ప్రచారం మొదలైంది. 2027 ప్రధమార్ధంలో జరుగుతాయని టాక్ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించారు. కానీ ఇప్పుడు జనగణన తెరపైకి రావడంతో.. అది పూర్తయిన తర్వాతే ఎన్నికలు అని స్పష్టమవుతోంది.
* 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ముందుగా పంచాయితీ ఎన్నికలు జరగగా.. తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. చివరిగా మండల, జిల్లా ప్రాదేశికాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు.
* పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరితో గడువు ముగియనుంది. అయితే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి.. తరువాత మిగతా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
* మార్చి వరకు మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లకు గడువు ఉంది. జిల్లా పరిషత్తులకు అయితే జూన్ వరకు గడువు ఉంది.* ఏప్రిల్ నుంచి జనగణన ప్రారంభం కానుంది. అది కొలిక్కి రావాలంటే ఈ ఏడాది డిసెంబర్ పడుతుంది. అందుకే కొత్త జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటే 2027 వరకు ఆగాల్సిందే.
* ప్రస్తుత జనాభా లెక్కలు 2011 వరకు మాత్రమే ఉన్నాయి.. ప్రతి పది సంవత్సరాలకు జరగాల్సిన జనగణన 2021లో కరోనా కారణంగా జరగలేదు. అందుకే ఇప్పుడు జనగణన పూర్తి చేసే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ పాత జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు నిర్వహించాలి అంటే ముందుగా పంచాయతీలను పూర్తి చేస్తారు.
* అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ప్రత్యేక నిధులు వర్తించవు. అదే జరిగితే గ్రామాల్లో మౌలిక వసతులు నిలిచిపోతాయి. అది ప్రభుత్వానికి ఇబ్బంది కరం. అందుకే ఎంత మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
* ముందుగా పంచాయితీల పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ప్రత్యేక అధికారులు వస్తారు. తరువాత కార్పొరేషన్ లతోపాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల నియామకం ఉంటుంది. జిల్లా పరిషత్తులకు సంబంధించి కూడా అదే పరిస్థితి.