Jana Sena Party formation day celebrations: జనసేన( janasena ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న జరగాల్సిన ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రాలకి పరిమితం చేయాలని చూస్తోంది. రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం లేనట్టే. ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీకి ఓటు తెచ్చింది ఆవిర్భావ దినోత్సవాలే. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇప్పుడు సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఈ సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వృధా ప్రయాస అన్నట్టు ఉంది జనసేన నాయకత్వం అభిప్రాయం. అందుకే ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఉద్దేశం లేదు. అందుకే ఉమ్మడి జిల్లాల వారీగా వేడుకలు నిర్వహించుకోవాలని పార్టీ నాయకత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
గత ఏడాది పిఠాపురంలో..
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తరువాత జనసేన.. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గత ఏడాది పిఠాపురంలో( Pithapuram) ఘనంగా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు భారీగా తరలివచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదిక పైనుంచి దిశా నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ ఆశయ సాధనకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విషయంలో కూడా అవకాశం ఇవ్వకూడదని.. కూటమి పార్టీల శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని పవన్ పిలుపునిచ్చారు. అదే క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నారు జనసైనికులు. అయితే ఏటా పిఠాపురంలోనే వేడుకలు నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి సన్నాహాలు ఏవి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు కేవలం ఉమ్మడి జిల్లాల వారీగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని ప్రత్యేక ప్రకటన జారీ చేయడం విశేషం.
అప్పట్లో మందడం సభతో..
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలే ఆ పార్టీకి ఊపు తెచ్చాయి. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జనసేన దారుణ పరాజయం చదివి చూసింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనసేన ను చాలా చులకనగా చూసాయి. అయితే అమరావతి ప్రాంతంలోని మందడంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని భావించారు పవన్ కళ్యాణ్. అంతకుముందు చాలా వేదికలు ఎంపిక చేశారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వేదికలు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మందడం ప్రజలు ముందుకు వచ్చి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తమ భూములను ఇచ్చారు. అదే వేదికపై పవన్ ఆవేశంగా ప్రసంగించారు. అప్పటి వైసిపి ప్రభుత్వానికి మందడం గ్రామస్తులు టార్గెట్ అయ్యారు. రోడ్డు విస్తరణ పేరిట గ్రామస్తులను అప్పట్లో ఇబ్బందులు పెట్టారు. వారికి అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం.. వారికి జరుగుతున్న అన్యాయంపై గళం ఎత్తడం అప్పట్లో సంచలనమే. అలా ఆ పార్టీ ఆవిర్భావం అధికారంలోకి రావాలన్న కసిని జనసైనికులు పెంచింది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు కారణం అయ్యింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రస్థాయిలో జరిగాయి. ఈ ఏడాది మాత్రం అటువంటిదేమీ లేకుండా పోయింది. 2027, 2028 వరుసగా రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించి 2029 ఎన్నికలకు వెళ్లాలన్నది జనసేన ప్రణాళికగా తెలుస్తోంది.