Jagan: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయలేదు. కానీ అప్పుడే విపక్షాలను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా బేవరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో సిఐడి తనిఖీలు ముమ్మరం చేసింది. కీలక ఫైళ్లను సొంతం చేసుకుంది. దీంతో మున్ముందు కష్టాలు తప్పవని జగన్ కు స్పష్టమైన సంకేతాలు పంపింది కొత్త ప్రభుత్వం. జగన్ సర్కారులో కీలక అధికారులుగా వ్యవహరించిన వారి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తద్వారా జగన్ ఇబ్బంది పెట్టడమేనని తెలుస్తోంది. అందులో భాగంగానే అతిపెద్ద కుంభకోణంగా భావిస్తున్న మద్యం పై పడినట్లు సమాచారం.
Also Read: YS Sharmila : కాంగ్రెస్ ఫండింగ్ పక్క దారి.. షర్మిలపై ఆరోపణలు నిజమేనా?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే నాసిరకం మద్యంతో పాటు అమాంతం ధరలను పెంచింది. కేవలం నగదు లావాదేవీలనే ప్రోత్సహించింది. వీటన్నింటి వెనుక భారీ కుంభకోణం ఉందని విపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా మద్యం కంపెనీల అనుమతిలో బేవరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యం కుంభకోణం పై పడతారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మద్యం కుంభకోణాన్ని బయటకు తీసే పనిలో పడింది సిఐడి.
Also Read: Rammohan Naidu : రామ్మోహన్ నాయుడు కు రైల్వే శాఖ?
అయితే వాసుదేవ రెడ్డి అప్రూవర్ గా మారిపోయారని టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. మద్యం పాలసీలో లోపాలు, ఎవరెవరు ఉన్నారు,? ఎంత దోపిడీ జరిగింది? ఇందులో కీలక నేతల హస్తం ఏ మేరకు? ఎంత మొత్తంలో అందింది? వంటి వివరాలను వాసుదేవరెడ్డి సిఐడికి వివరించినట్లు టిడిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. అయితే గత మూడు రోజులుగా వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు కొనసాగుతుండడం కూడా సిఐడి పట్టుదలను తెలియజేస్తోంది. మొత్తం మద్యం పాలసీ పై పెద్ద ఎత్తున మధనం జరుగుతున్నట్లు సమాచారం. వాసుదేవరెడ్డి ద్వారా జగన్ చుట్టూ ఉచ్చు బిగించాలన్నదే ఈ ప్రయత్నం గా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మధ్యలో జరిగిన అవినీతిని చంద్రబాబు నేరుగా బయట పెడతారని సమాచారం. మొత్తానికైతే లిక్కర్ షాక్ తో జగన్ సైతం ఓ రకంగా ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.