Rammohan Naidu : టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో చిన్న వయస్కుడు కూడా ఆయనే.శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలిచారు రామ్మోహన్ నాయుడు. తండ్రి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడే అన్నట్టు సత్తా చాటారు. టిడిపి ఎన్ డి ఏ లో చేరడంతో రామ్మోహన్ నాయుడుకు మంత్రి పదవి ఖాయమైంది.
క్యాబినెట్ హోదా దక్కడం అంత ఆషామాషీ విషయం కాదు. దేశవ్యాప్తంగా 30 మందికి క్యాబినెట్ హోదా కల్పిస్తే.. అందులో రామ్మోహన్ నాయుడు ఒకరు కావడం విశేషం. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు? అన్నదానిపై బలమైన చర్చ నడుస్తోంది. ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించిన గ్రామీణాభివృద్ధి శాఖ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. పట్టణాభివృద్ధి శాఖ కూడా ఆయనకు కేటాయిస్తారని టాక్ నడిచింది. కానీ ఆ రెండు శాఖలు కాదని కీలక శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రైల్వే శాఖను కేటాయిస్తారని తెలుస్తోంది. అన్ని శాఖల కంటే రైల్వే శాఖ ప్రాధాన్యమైన శాఖ. చాలా క్లిష్టమైనది కూడా. అందుకే మోడీ రామ్మోహన్ నాయుడు వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇండియన్ రైల్వే సంస్కరణల దిశగా ఉంది. వందే భారత్ తో పాటు బుల్లెట్ రైలు వంటి భవిష్యత్ ఆశలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటి సమయంలో రామ్మోహన్ నాయుడు లాంటి సమర్థత నేతకు శాఖ అప్పగిస్తే సజావుగా సాగిపోతుందని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో దక్షిణాది రాష్ట్రాలకు రైల్వే శాఖ కేటాయించిన దాఖలాలు లేవు. అందుకే ఈసారి తెలుగుదేశం పార్టీకి రైల్వే శాఖ అప్పగిస్తారని సమాచారం. అదే జరిగితే ఏపీకి మహర్దశ పట్టినట్టే. ముఖ్యంగా విభజన హామీలు అమలు చేయడానికి ఒక మార్గం ఏర్పడుతుంది.
రాష్ట్ర విభజనలో భాగంగా విశాఖకు రైల్వే జోన్ కేటాయించాల్సి ఉంది. 2019 ఎన్నికలకు ముందే కేంద్ర క్యాబినెట్ విశాఖ రైల్వే జోన్ ప్రకటించింది. అయితే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టలేదు. పట్టించుకున్న దాఖలాలు లేవు. రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం అడిగిన ఇవ్వలేదని కేంద్రం ఆరోపించిన సంగతి తెలిసిందే. అందుకే రామ్మోహన్ నాయుడుకు రైల్వే శాఖ వస్తే మాత్రం ఏపీకి మహర్దశ పట్టినట్టే. విభజన హామీల అమలతో పాటు.. ఏపీ ప్రజలకు రైల్వే కష్టాలు కొంతవరకు తీరుతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.