Land Titling Act: ఏపీలో విపక్షాలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రచారాస్త్రంగా మారింది. ఇటీవల వైసిపి ఈ చట్టాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందన్న విమర్శ ఉంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత ఆస్తులపై కూడా వారి హక్కును ప్రభుత్వమే లాక్కునేలా ఈ యాక్ట్ ఉందని విపక్షాలు ఆరోపించడం ప్రారంభించాయి. టిడిపి, జనసేనలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
అయితే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ భూ రక్ష చట్టం అంటూ వైసీపీ చెబుతోంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు రంగు వేయడానికి కొన్ని వందల కోట్లు వెచ్చించిన వైనం కళ్ళముందు సాక్షాత్కారం అవుతూనే ఉంది. చివరకు విద్యార్థుల పాఠ్యపుస్తకాలపై రాష్ట్ర ప్రభుత్వ ముద్రను తొలగించి జగన్ ఫోటోను ముద్రించిన సంఘటనల మీద చాలా రకాల విమర్శలు ఉన్నాయి. అవినీతి కేసుల్లో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఫోటోను పాఠ్యపుస్తకాలపై ముద్రించడంతో.. విద్యార్థులకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని చంద్రబాబుతో పాటు పవన్ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి పత్రాలు మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద గతంలో ఏ సీఎం కూడా తన ఫోటోను ముద్రించడానికి సాహసించలేదు. అది ప్రజల వ్యక్తిగత ఆస్తి కనుక దానికి సంబంధించిన పత్రాల్లో వారి ఫోటోలనే పొందుపరిచేవారు.
అయితే ప్రజల వ్యక్తిగత ఆస్తుల పత్రాలపై జగన్ ఫోటో ఉండడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరుతోంది. కూటమి పార్టీల నేతల ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితికి పరిస్థితి చేరింది. పులివెందులలో సొంత పార్టీ నేత నుంచిజగన్ సతీమణి భారతికి దీనిపైనే నిలదీసినంత పని జరిగింది. తమ ఆస్తులపై మీ భర్త ఫోటో ఎందుకు అని ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. అయితే ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే భారతి అక్కడి నుంచి జారుకున్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం కలుగుతోంది. కానీ ఈ విమర్శలను తిప్పి కొట్టడంలో వైసీపీ నేతలు విఫలమవుతున్నారు. కేవలం భూ సమస్యల పరిష్కారానికి అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.