Lambasinghi : దక్షిణ భారతదేశంలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే.. మన ఆంధ్ర అందాలు చూడండి
కాశ్మీర్ అందాలు వర్ణించలేం. మనసును దోచేస్తుంది ఆ ప్రాంతం. అటువంటి ప్రాంతమే ఏపీలోనూ ఉంది. ఉమ్మడి విశాఖలోని మన్యప్రాంతమైన లంబసింగి ఎంతో ప్రాచుర్యం పొందింది.
Lambasinghi : శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం చలి ఉంటుంది. పొగ మంచు ఎక్కువగా కురుస్తుంది. కానీ ఓ ప్రాంతంలో మాత్రం అచ్చం కాశ్మీర్ మాదిరిగానే మంచు వర్షం కురుస్తుంది. అదే లంబసింగి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మన్య ప్రాంతంలో ఉంటుంది ఈ ప్రదేశం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. చలికాలంలో ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుంది. దక్షిణ భారతదేశంలో మంచు పడే ఏకైక ప్రాంతం కూడా ఇదే. అందుకే లంబసింగిని ఏపీ కాశ్మీర్ గా వర్ణిస్తారు. శీతాకాలం వచ్చిందంటే చాలు లంబసింగిలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అయితే అమాంతం పడిపోతాయి.అయితే ఈ ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన వరం.అందుకే పర్యాటకుల నిత్య తాకిడితో ఉంటుంది ఈ ప్రాంతం.
* మనసు దోచే
చుట్టుపచ్చదనం, పచ్చిక బయలతో కూడిన కొండలు మనసును దోచేస్తాయి. శీతాకాలంలో ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చాలాసార్లు కనిష్ట ఉష్ణోగ్రతలు జీరో సెల్సియస్ కు చేరుకుంటాయి. సాధారణంగా డిసెంబర్ నుంచి జనవరి వరకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది. ఇక్కడకు వెళ్తే కాశ్మీర్ వెళ్లినట్టే. అంతటి అనుభూతి పొందవచ్చు.ప్రస్తుతం లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. రెండు నెలల పాటు పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
* పర్యాటక ప్రాంతాలు
లంబసింగికి సమీపంలో చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంటుంది. అక్కడికి వెళ్లే దారి కూడా చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ రిజర్వాయర్లో బోటింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడ జిప్ వే కూడా ఉంటుంది. అందులో జారుతూ ప్రకృతి అందాలను తిలకించవచ్చు. అక్కడ గిరిజన గూడలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. లంబసింగికి 40 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఈ జలపాతంలో స్నానాలు కూడా చేయవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం.
* ఇలా చేరుకోవాలి
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందింది లంబసింగి. ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వెళ్లాలంటే ముందుగా విశాఖ నగరానికి చేరుకోవాలి. విశాఖ నుంచి రైలు, రోడ్డు మార్గంలో లంబసింగి చేరుకోవచ్చు. విశాఖ నుంచి లంబసింగికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే అనకాపల్లి, తాళ్లపాలెం, నర్సీపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే దారి పొడవునా ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.