Kothavalasa: అప్పటివరకు ఆ కోళ్లు అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. వారం రోజుల వ్యవధిలో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. అంతుచిక్కని వ్యాధి తో చనిపోతున్నాయి కోళ్లు. దీంతో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయనగరం ( Vijayanagaram) జిల్లాలో కొత్తవలస మండలం విశాఖకు సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో వందలాది కోళ్ల ఫారంలు ఉంటాయి. బ్రాయిలర్ కోళ్ల జోన్ గా కూడా ఉంది. విజయనగరం జిల్లాకు సంబంధించి కొత్తవలస, వేపాడ, లక్కవరపుకోట.. విశాఖ జిల్లాకు సంబంధించి కోటపాడు, దేవరపల్లి మండలాల్లో వందల సంఖ్యలో కోళ్ల ఫారం లు ఉంటాయి. అయితే గత వారం రోజులుగా లక్షల కోళ్ళు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.
* నాటు కోళ్లు సైతం..
రామలింగాపురం లోని ఓ కోళ్ల ఫారంలో రెండు రోజుల వ్యవధిలో 38వేల నాటు కోళ్లు చనిపోయాయి. దీంతో ఇది వైరస్ అని తేలిపోయింది. ముందుగా బ్రాయిలర్( broiler) కోళ్లు లక్షలాదిగా చనిపోయాయి. ఇప్పుడు ఆ వైరస్ నాటు కోళ్లకు సైతం సోకింది. దీంతో ఫారంలలో కోళ్లు చనిపోవడంతో ఖాళీగా కనిపిస్తున్నాయి. రామలింగా పురానికి చెందిన రాంబాబు ప్రియాంక ఆగ్రో ఫారం పేరుతో 13 రేకుల షెడ్లలో 40 వేల నాటు కోళ్లను పెంచుతున్నాడు. అవన్నీ చనిపోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వాస్తవానికి బ్రాయిలర్ కోళ్లతో పోల్చుకుంటే నాటు కోళ్లు వ్యాధులకు తట్టుకుంటాయి. అటువంటి కోళ్లు ఇప్పుడు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
* అంతు చిక్కని వైరస్ తో
సాధారణంగా డిసెంబరు, జనవరిలో కోళ్లు చలికి తట్టుకోలేవు. ఆ సమయంలో ఎక్కువగా చనిపోతుంటాయి. లక్ష కోళ్ళు ఉన్న ఫారంలో 20 నుంచి 50 కోళ్లు ప్రతిరోజు చనిపోవడం సర్వసాధారణం. కానీ అంతకుమించి చనిపోతే మాత్రం ఆలోచించదగ్గ విషయం. కోళ్ల ఫారం నిర్వహకులు దాదాపు 20 వరకు వ్యాక్సినేషన్లు చేస్తారు. ఐ డ్రాప్స్ సైతం వేస్తారు. కానీ ఇప్పుడు అంతు చిక్కని వైరస్ తో కోళ్లు చనిపోతుండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. చనిపోయిన కోళ్లకు సంబంధించి శాంపిల్స్ ను సేకరించారు. విజయవాడ ల్యాబ్ కు పంపించారు. అక్కడ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు చనిపోయిన కోళ్లను పూడ్చి పెట్టాలని.. ఖాళీ చేసిన ఫారాల్లో షెడ్లను శుభ్రం చేయాలంటున్నారు అధికారులు. వ్యాధి సోకిన కోళ్ల వ్యర్ధాలను పొలాల్లో ఎరువు కింద కూడా వాడొద్దని సూచిస్తున్నారు. అయితే ఒకేసారి లక్షల కోళ్లు మృత్యువాత చెందడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక్కడి కోళ్ల ఫారాలు ప్రముఖ కంపెనీల హేచరీలతో ఒప్పందం చేసుకుంటాయి. కోడి పిల్లలతో పాటు దాణాను కూడా అందిస్తాయి. అయితే ప్రస్తుతం కోడి ఉత్పత్తి అవుతున్న తరుణంలో ఈ వైరస్ రావడంతో భారీగా నష్టపోయారు ఫారం యజమానులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.