PottiMama Ravindra Kumar: ఆయన ఎత్తు 4 అడుగులు కూడా ఉండదు. బక్క పలచటి మనిషి. కానీ డ్యాన్సులు ఇరగదీస్తాడు. ఆరుపదుల వయసులో ఆయన డ్యాన్స్ లో చూపే మేనరిజం అచ్చం మెగాస్టార్ చిరంజీవిని పోలి ఉంటుంది. అందుకే ఆయన డాన్సులను జనం బాగా చూస్తారు. లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్ గా మారి.. బుల్లితెరపై సైతం మెరుస్తున్నారు శ్రీకాళహస్తికి చెందిన పొట్టి మామ అలియాస్ భీమవరం రవీంద్ర. సోషల్ మీడియాలో రీల్స్ చూసిన ఆయనే.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సుపరిచితమే. పొట్టి మామ డాన్స్ అంటే ఎవరైనా చూడాల్సిందే. అంతలా సెలబ్రిటీగా మారిపోయారు పొట్టి మామ.
కళాకారుల కుటుంబం..
కళాకారుల కుటుంబం నుంచి వచ్చాడు పొట్టి మామ. ఆయనది శ్రీకాళహస్తి మండలం భీమవరం. ఆయన తాత భీమవరం నరసయ్య వీధి భాగోతాలు ఆడడంలో సుప్రసిద్ధ కళాకారుడు. తండ్రి వెంకట కృష్ణయ్య సైతం వీధి నాటకాలు ఆడేవారు. అయితే ఇలా నాటకాల పిచ్చితో 18 ఎకరాల భూమి కాస్త నాలుగున్నర ఎకరాలుగా మిగిలింది. చివరకు పొట్టి మామ ఆ భూమిని సైతం విక్రయించి.. అలా వచ్చిన మొత్తంతో చెన్నై వెళ్లాడు. కథలు రాసి వాటిని వినిపించేందుకు దర్శకుల వద్దకు వెళ్లేవాడు. కానీ పొట్టి మామ గోడు విన్నవారు కరువయ్యారు. ఈ క్రమంలో ఆకలి నింపుకునేందుకు మద్రాసులోనే ఒక హీరోయిన్ ఇంటిదగ్గర కుక్కలను చూసుకునేవాడు. ఎప్పటికైనా సినిమా వాళ్ళ చూపు తనపై పడుతుందని ఆశతో బ్రతికేవాడు. మద్రాస్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద ఆకలితో పడుకున్న ఆయనను పోలీసులు గుర్తించారు. నాయుడుపేట రైలు ఎక్కించారు. అలా చేరుకునేసరికి ఆయన తండ్రి సైతం మృతి చెందారు. అంతకుముందే తల్లి సైతం మృత్యువాత పడ్డారు. పుట్టిన గ్రామంలోనే అనాధగా మారారు పొట్టి మామ.
అనాధగా మారి
అయితే గ్రామంలోనే వారాల అబ్బాయిగా మారిపోయారు పొట్టి మామ. ఎవరైనా అన్నం పెడతారా అన్నట్టు ఆయన బతుకు ఉండేది. అనంతరం వెంకటగిరిలో ఓ బారులో సప్లయర్ గా మారారు. అక్కడ పని చేస్తూనే సాంఘిక నాటకాలు పై దృష్టి పెట్టారు. ఓ 60 నాటకాలను తానే సొంతంగా రాసి.. నటించేవారు. పిల్లలకు నటనపై అవగాహన కల్పించేవారు. దానిని ఒక ఉపాధి మార్గంగా చూసుకున్నారు. అనంతరం సమీప బంధువు సుబ్బరత్నం పెళ్లి చేసుకున్నారు. గ్రామంలోనే మేకలు మేపుతూ, నాటకాలు ఆడుతూ కడుపు నింపుకునే వారు.
అలా యూట్యూబ్ స్టార్ గా..
అయితే ఓ కుర్రాడి ఆలోచన పొట్టి మామను యూట్యూబ్ స్టార్ గా మార్చింది. ప్రజ్వల్( Prajwal ) అనే యువకుడు పొట్టి మామకు పరిచయం అయ్యాడు. యూట్యూబ్ స్టార్ గా పరిచయం చేశాడు. మొదట చిన్న చిన్న స్క్రిప్టులు చేసేవారు. వాటికి వ్యూస్ రావడంతో.. ఇప్పుడు పొట్టి మామతో డాన్సులు వేయిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆరుపదుల వయస్సు ఉన్న పొట్టి మామకు జతగా రెండు పదుల వయసు ఉన్న యువతులు డాన్స్ వేస్తున్నారు. కొన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఆ పాటలు. ముఖ్యంగా పొట్టి మామ చిరంజీవి పాటలకు ఇరగదీస్తున్నాడు. అవి బాగా ట్రెండింగ్ కూడా అవుతున్నాయి. దీంతో ఈవెంట్ల అవకాశం కూడా సొంతం చేసుకుంటున్నాడు పొట్టి మామ. ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నాడు. భూములు పోయినా.. ఆస్తులు పోయినా.. ఇప్పుడు మాత్రం ఆనందంగా ఉన్నానని చెబుతున్నాడు పొట్టి మామ.