MP Sanjeev Kumar: వైసీపీని వీడిన కర్నూలు ఎంపీ.. జగన్ కు షాక్

సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి ఎంపీగా పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు.

Written By: Dharma, Updated On : January 11, 2024 11:35 am

MP Sanjeev Kumar

Follow us on

MP Sanjeev Kumar: ఏపీలో ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సీట్లు దక్కని వారు పక్క పార్టీలోకి జంపింగ్ చేస్తున్నారు. టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్ సభ సభ్యత్వం తో పాటు పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా కర్నూలు వైసిపి ఎంపీ సంజీవ్ కుమార్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీని వీడనున్నట్లు తేల్చి చెప్పారు. త్వరలో లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా సమర్పిస్తానని సంజయ్ కుమార్ వెల్లడించారు.

సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి ఎంపీగా పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ కు మొండిచేయి తప్పదని తేలిపోయింది. దీనిపై సీఎం జగన్ కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సంజీవ్ కుమార్ రాజీనామా బాట పట్టారు. ఎంపీ పదవితో పాటు పార్టీకి రిజైన్ చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈసారి టికెట్ దక్కదని ప్రచారం జరిగింది. ఆయనపై వ్యతిరేకత ఉందని సర్వేలు తేల్చి చెప్పాయి. దీంతో పక్కన పెడతారని ప్రచారం జరిగింది. కానీ జయరాం సమీప బంధువు కర్ణాటక మంత్రి నాగేంద్ర లాబీయింగ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆయనకు ఎంపీగా టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాగేంద్రకు బద్ధ శత్రువైన బిజెపి మాజీ మంత్రి శ్రీరాములు జయరాంకు టికెట్ ఇవ్వొద్దని వైసిపి హై కమాండ్ కు కోరినట్లు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం గుమ్మనూరు జయరాం కు ఎంపీ సీటు ఖరారు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

వైసీపీలో బీసీ ఎంపీలకు కనీస విలువ లేదని సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో తాను వ్యక్తిగతంగా రెండుసార్లు మాత్రమే జగన్ ను కలిశానని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికేందుకు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సమయంలోనే బృందంలో ఒక సభ్యుడిగా ఉన్నానని.. అంతకుమించి ఏమీ లేదని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఆ నలుగురు ఎంపీలకు తప్ప మిగతా వారికి ప్రాధాన్యం ఉండదన్నారు. అందుకే ఆ పార్టీలో కొనసాగడం వృధా ప్రయాసగా భావించి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. సన్నిహితులతో ఆలోచించి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటానని సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు.