YCP: ఆ మీడియా రాతలు.. వైసీపీ దాడులు.. ఇంతకీ అసలు తప్పెవరిది?

ఇటీవల సిద్ధం సభకు "మేము పిలవకున్నా వచ్చాడని" ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై వైసీపీ నాయకులు దాడి చేశారు.

Written By: Velishala Suresh, Updated On : February 21, 2024 4:58 pm

YCP

Follow us on

YCP: రాజకీయం పరిధి దాటకూడదు. మీడియా హద్దులు మీరకూడదు. కార్యనిర్వాహక వ్యవస్థగా ప్రజాప్రతినిధులు… నాలుగో స్తంభానికి రక్షకులుగా మీడియా..ఎప్పుడూ ప్రజా కోణంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు లైన్ తప్పినా ఆ ప్రభావం మొత్తం మిగతా సమాజం మీద పడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహించే ఆ రాష్ట్రంలో అటు ప్రభుత్వం, ఇటు ఆ రెండు పత్రికలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదేపదే ఆ రెండు పత్రికలు అని సంబోధిస్తుంటే.. ఈ పత్రికలు తాము జర్నలిజం లో ఉన్నామని మర్చిపోయి వ్యవహరిస్తున్నాయి. అయితే ఇవి విమర్శల వరకే ఉంటే బాగుండేది. కానీ అది హద్దు దాటి దాడులకు పాల్పడేదాకా దారితీస్తోంది.

ఇటీవల సిద్ధం సభకు “మేము పిలవకున్నా వచ్చాడని” ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. “మా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న పత్రిక ఫోటోగ్రాఫర్ కు.. ఆ పార్టీ మీటింగ్ తో సంబంధం ఏంటని” వైసిపి నాయకులు అంటున్నారు. పైగా ఇక్కడ ఖాళీగా కుర్చీల ఫోటోలు తీసి.. జగన్ సభకు ఎవరూ రాలేదని ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. అలాంటప్పుడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడంలో తప్పు లేదని కొడాలి నాని లాంటి రాజకీయ నాయకులు సమర్ధిస్తున్నారు. ఆ దాడి తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఒకరిద్దరిని అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక రాప్తాడు ఘటన మర్చిపోకముందే.. మంగళవారం కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడులు చేశారు. అయితే ఈ ఘటనల్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు బాధితుల్లాగా తెరపై కనిపిస్తున్నప్పటికీ.. వాటి అసలు ఎజెండా వేరే ఉందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. “తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఏకపక్షంగా రాశాయని.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అడ్డగోలుగా రాస్తున్నాయని.. ఇన్నాళ్లు మేము ఓపిక పట్టాం.. ఇకపై ఆ పరిస్థితి లేదని” వైసిపి నాయకులు హెచ్చరిస్తున్నారు.

మీడియాపై దాడులు సమాజానికి మంచిది కాకపోయినప్పటికీ.. మీడియా ముసుగులో రాజకీయాలు చేయడమేంటని.. ఒక పార్టీకి ఏకపక్షంగా వార్తలు రాయడమేంటని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తే ఈనాడు పత్రిక ఏకపక్షంగా రాసిందని.. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పే హక్కు ఈనాడుకెక్కడిదని.. ఏపీ ప్రజలు ఎన్నుకుంటేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆ విషయం ఈనాడుకెందుకు అర్థం కావడం లేదని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు..

మరోవైపు ప్రభుత్వ తప్పిదాలను తమ రాస్తుంటే జగన్ అనుచరులు దాడులు చేస్తున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరోపిస్తున్నాయి. అన్ని రంగాలలో ఏపీ అధోగతిలో ఉందని.. అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిందని.. ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమని ఆంధ్రజ్యోతి, ఈనాడు అంటున్నాయి. తాము పాత్రికేయపరంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసే జర్నలిస్టులంటున్నారు.

అయితే ఈ పరిణామాలు ఎవరికీ మంచివి కావని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని.. ఆ బాధ్యత మర్చిపోయి ఒక పార్టీకి డప్పు కొడితే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు. ప్రభుత్వం కూడా కొన్ని పత్రికలపై కక్ష సాధింపు ధోరణి మానుకోవాలని.. ఒక పత్రికకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే.. మిగతా వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మీడియా, ప్రభుత్వం జోడెద్దుల్లాగా పని చేయాలని.. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తేనే తేడాలు వస్తాయని వారు హితవు పలుకుతున్నారు. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందోనని సీనియర్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.