https://oktelugu.com/

Vladimir Putin: ప్రతిపక్ష నాయకుడు చనిపోయినా పుతిన్ పగ చల్లారడం లేదా?

ఒలెగ్ కోసం అక్కడ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒలెగ్ పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒలెగ్ కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 21, 2024 / 04:59 PM IST
    Follow us on

    Vladimir Putin: ఇటీవల రష్యా జైల్లో అనుమానాస్పద స్థితిలో అక్కడి ప్రతిపక్ష నేత అలెక్సి నావల్ని చనిపోయారు. అతడి మృతి పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పుతిన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్ వల్లే అతడు చనిపోయాడని ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నప్పటికీ పుతిన్ మాత్రం తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని చనిపోయినప్పటికీ అతని కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్ని పై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటికి తోడుగా పుతిన్ ప్రభుత్వం మరో కేసు పెట్టింది.. ఏ సెక్షన్ పై ఎందుకు ఒలెగ్ పై కేసు పెట్టారనే విషయాన్ని రష్యా ప్రభుత్వం చెప్పడం లేదు.

    ఈ కేసు నమోదు కాగానే ఒలెగ్ కోసం అక్కడ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒలెగ్ పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో ఒలెగ్ కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తనపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఒలెగ్ పై పుతిన్ ప్రభుత్వం కేసులు నమోదు అలెక్సీ నావల్ని ఆరోపించాడు. పుతిన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాడు. అతడు చేసిన విమర్శల ఆధారంగానే అప్పట్లో ప్రభుత్వం అరెస్టు చేసింది. వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేసింది. ఆ కేసులకు సంబంధించి న్యాయ విచారణ అనంతరం అతడు ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైల్లో ఉండగానే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

    నావల్ని మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం పుతిన్ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. పుతిన్ వల్లే తన భర్త మృతిచెందాడని , అతనిపై ప్రతికారం తీర్చుకుంటామని నావల్ని భార్య శపథం చేసింది. అయినప్పటికీ పుతిన్ ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. అలెక్సి అనుచరులపై ఉక్కు పాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తోంది. వారికి పోలీసు మార్క్ పనిష్మెంట్ ఇస్తోందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ తో యుద్ధం సమయంలోనూ రష్యా ప్రజలు ఇదేవిధంగా నిరసనలు తెలిపారు. అయినప్పటికీ పుతిన్ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు.