https://oktelugu.com/

Kurnool: కానిస్టేబుల్ పోస్ట్ కోసం.. ఏకంగా రిజల్ట్ ని మార్చేశాడు.. చివరకు అలా దొరికాడు

అడ్డదారిలో ఉద్యోగం( job) పొందాలనుకున్నాడు ఆ యువకుడు. కానీ చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.

Written By: , Updated On : January 22, 2025 / 01:15 PM IST
Kurnool

Kurnool

Follow us on

Kurnool: ఏపీలో( Andhra Pradesh) కానిస్టేబుల్ నియామకాల కు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం ఓ అభ్యర్థి ఘరానా మోసం బయటపడింది. అభ్యర్థి ఫెయిల్ అయితే ఏకంగా రిజల్ట్ మార్చేశాడు. నకిలీ హాల్ టికెట్ తయారు చేసి అందులో అర్హత సాధించినట్లు మాయ చేశాడు. పరుగు పరీక్షకు వెళ్లిన సమయంలో పోలీస్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ అభ్యర్థి ముందే ఎత్తు, ఛాతి కొలతలు సరిగా లేకపోవడంతో అర్హత సాధించలేదు. సాధారణంగా కానిస్టేబుల్ ఎంపికకు హాజరయ్యే అభ్యర్థులు ఎంతో శిక్షణ పొందుతారు. కఠోర శ్రమ పడతారు. కానీ ఆ యువకుడు మాత్రం అడ్డదారిలో వెళ్లాలని భావించాడు. అడ్డంగా దొరికిపోయాడు.

* అర్హత కోల్పోవడంతో
కర్నూలు జిల్లా( Kurnool district) కేంద్రంలో కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. కోసిగి మండలం దొడ్డి బెలగల్ కు చెందిన తిరుమల అనే యువకుడు ప్రిలిమ్స్ పరీక్షలు రాసి పాసయ్యాడు. కానీ కానిస్టేబుల్ ఉద్యోగానికి కావాల్సిన ఎత్తు, చాతి కొలతలు లేకపోవడంతో.. ఆ తరువాత నిర్వహించే పరీక్షలకు అర్హత కోల్పోయాడు. పోలీస్ అధికారులు తిరుమలకు ఇచ్చిన హాల్ టికెట్లో డిస్ క్వాలిఫై అయినట్లు చూపారు. ఇక్కడే తిరుమల అతి తెలివి ప్రదర్శించాడు. నకిలీ హాల్ టికెట్ సృష్టించి అందులో అర్హత సాధించినట్లు తనకు తానే నమోదు చేసుకున్నాడు. నేరుగా వెళ్లి 1600 మీటర్ల పరుగు పరీక్షకు హాజరయ్యాడు. అక్కడ వీధుల్లో ఉన్న అధికారి నాగభూషణం హాల్ టికెట్ తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్కు ఇచ్చారు. తిరుమల వివరాలను చెక్ చేస్తే.. అందులో ఎత్తు, ఛాతి కొలతలు సరిగ్గా లేకపోవడంతో అర్హత కోల్పోయినట్లు తేలింది. అనుమానంతో హాల్ టికెట్ పరిశీలిస్తే నకిలీదిగా తేలింది.

* కఠిన చర్యలు
క్షణాల్లో ఈ విషయం అంతటా వ్యాపించింది. దీంతో పోలీసులు జిల్లా ఎస్పీ( superintendent of police ) దృష్టికి తీసుకెళ్లారు. ఆ యువకుడి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు తిరుమలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అత్యాశకు పోయి తిరుమల అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు జైలు పాలయ్యాడు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

* రాష్ట్రవ్యాప్తంగా అలెర్ట్
మరోవైపు ఫేక్ హాల్ టికెట్( fake hall ticket ) వెలుగు చూసిన నేపథ్యంలో పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ తుది పరీక్షకు 267 మంది అర్హత సాధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పరీక్షల కోసం వచ్చిన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరిస్తున్నారు. అనంతరం అర్హతకు సంబంధించిన పత్రాలను చెక్ చేస్తున్నారు. అటు తరువాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి.. అక్కడ అర్హత సాధించిన తర్వాత 1600 మీటర్ల పరుగు పరీక్షకు ఎంపిక చేస్తున్నారు. మొత్తానికైతే కర్నూలులో ఈ ఘరానా మోసంతో రాష్ట్ర మొత్తం పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. నియామక ప్రక్రియ దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.