Kurnool bus incident: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసముద్రం మండలం ఇంటి కన్నె వద్ద గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. నాటి ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదంగా ఇది నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత.. అక్కడ ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు అక్కడి మృతహాల మీద బంగారాన్ని తీసుకెళ్లారు. నగదును పట్టుకెళ్ళారు. వాస్తవానికి జరిగిన ప్రమాదంపై ఎంతో కొంత సానుభూతి చూపించాల్సిన చోట.. మనుషులుగా ప్రవర్తించాల్సిన చోట.. చుట్టుపక్కల వారు రాక్షసులుగా మారిపోయారు. అవకాశవాదులుగా రూపాంతరం చెంది.. సాటి మనుషులను చూడకుండా డబ్బు, బంగారం దోచుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా టేకురు ప్రాంతంలో వేమూరి ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది దాకా చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణిస్తున్న 20మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఏపీ ప్రభుత్వం నియమించిన దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. బస్సులో ఉన్న మాంసపు ముద్దలకు పోస్టుమార్టం నిర్వహించింది. డిఎన్ఏ పరీక్షల ఆధారంగా వారి వారి బంధువులకు వాటిని అప్పగించింది.
ఈ ఘటన జరిగిన తర్వాత బస్సు ఉన్న ప్రాంతంలో కొంతమంది ఆటోలో వచ్చి వెళ్తున్నారు. రావడం మాత్రమే కాదు అక్కడ ఉన్న బూడిదను బస్తాలలో ఎత్తుకుపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మృత దేహాలు కాలిపోయిన తర్వాత వారు ధరించిన బంగారం, ఇతర ఆభరణాలు అందులో ఉంటాయని వారు భావిస్తున్నారు. ఆ ఆశతోనే ఆ బూడిదలో వెతుకులాట ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. బూడిదను సంచుల్లో తీసుకెళ్లి సమీపంలో ఉన్న ఒక నీటి కుంట వద్ద కడుగుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి బంగారం లభించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రముఖంగా ప్రసారం కావడంతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చనిపోయిన వ్యక్తుల మీద సానుభూతి కూడా చూపించకుండా.. బూడిదలో కూడా బంగారాన్ని సేకరించడం దారుణమని కొందరు పేర్కొంటుంటే.. ఇంకొందరేమో ఆ బూడిద ఎలాగైనా వృధాగా పోవాల్సిందే కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన మనుషుల్లో ఉన్న స్వార్ధాన్ని బయటపెడుతోంది.