Kurnool Bus Accident Latest Updates: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివార్లలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం వేకువజామున ప్రమాదానికి గురైంది. అగ్నిప్రమాదం కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు. ఇది రాజకీయ నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, సాంకేతిక అవగాహనలేమి కలయికతో ఏర్పడిన విషాదం. ఫోరెన్సిక్ బృందం ప్రాథమిక నివేదిక ప్రకారం, లగేజీ క్యాబిన్‌లో రవాణా చేసిన వందల సంఖ్యలో మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడు అగ్నికి ఆజ్యం పోశాయి. బస్సు కింద ఇరుక్కున్న ద్విచక్ర వాహనం నుంచి కారిన పెట్రోల్ నిప్పురవ్వలను అంటుకోవడంతో పరిస్థితి నియంత్రణలో ఉండలేదు. క్షణాల్లోనే బస్సును మంటలు చుట్టేసాయి. అధిక ఉష్ణానికి ప్రయాణికుల వద్ద ఉన్న ఫోన్లలోని లిథియం బ్యాటరీలు గుంపుగా పేలిపోవడం వలన విస్ఫోట శబ్దం, దట్టమైన పొగ ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా చేశాయి.
సాంకేతిక వైఫల్యం.. నిబంధనలకు విరుద్ధం..
మంటలు వ్యాపించగానే ప్రయాణికులు అత్యవసర డోర్ వైపు పరుగులు తీశారు. కానీ అది పనిచేయకపోవడంతో ప్రథమ సీట్లు, బెర్త్‌లు ఆక్రమించిన వారు మంటల్లో చిక్కుకున్నారు. డ్రైవర్ అయితే కిటికీ గుండా బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ఘటన సాంకేతిక వైఫల్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రైవేట్ బస్సులు ప్రయాణికుల రవాణాతో పాటు సరకుల తరలింపుకు కూడా ఉపయోగపడుతున్నాయి. లగేజీ క్యాబిన్‌లలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులు తరలించడం సామాన్యమైపోయింది. నిబంధనల ప్రకారం ఇది పూర్తిగా నిషేధితం. కానీ తగిన తనిఖీల లేమి, అవినీతి, లాభాల ఆశ ఈ ప్రమాదాలకు మార్గం సుగమం చేస్తోంది. కర్నూలు ఘటనలో కూడా ఈ సరకు రవాణా అలవాటు మంటల తీవ్రతను రెట్టింపు చేసింది.
పేలిన లిథియం బ్యాటరీలు..
కావేరి బస్సులో 400 మొబైల్ ఫోన్లకు సంబంధించిన పార్సిల్ ఉంది. బ్యాటరీలలో ఉన్న లిథియం లోహం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు వేగంగా ప్రతిచర్య చూపి పేలిపోతుంది. ప్లాస్టిక్ కవరింగ్‌తో కలిపి ఈ పేలుడు మంటలను మరింత వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తుంది. ఒకే సమయంలో వందల బ్యాటరీలు ఉన్నప్పుడు అది ఒక విస్పోటనంగా మారింది. ఇలాంటి వస్తువులను సాధారణ ప్రయాణికుల వాహనాల్లో తరలించడం కేవలం నిబంధనల ఉల్లంఘన కాదు, మానవ ప్రాణాలను పణంగా పెట్టే చర్య.
బస్సు నిర్వాహకులు అదనపు ఆదాయం పొందడానికి ఎలక్ట్రానిక్ సరుకులను రహస్యంగా రవాణా చేయడం కొత్త విషయం కాదు. ప్రతి బస్సు ఒక చలించే గిడ్డంగిగా మారుతోంది. కానీ ఈ దౌర్జన్యానికి మూల్యం మాత్రం ప్రయాణికులే చెల్లిస్తున్నారు. కర్నూలు ఘటన ఈ దుర్వ్యవస్థకు మలుపు కావాలి. లేకపోతే ప్రజా రవాణా పట్ల నమ్మకం పూర్తిగా కుప్పకూలిపోవడమే సమయం.