Tirumala Leopard Attack : బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులపైనే నిందలేంటి ప్రసన్న?

బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులపైనే నిందను మోపారు. రాజకీయాల కోసం ఇంతకి దిగజారుతారా అన్న విమర్శలను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మూట గట్టుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : August 13, 2023 2:19 pm
Follow us on

Tirumala Leopard Attack : విపరీత మనస్తత్వం ఉన్నవారికి ఆతరహా ఆలోచనలే వస్తాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ నాయకులు భిన్న వైఖరితో వ్యవహరిస్తారు. నిత్యం రాజకీయ ఆలోచనలతోనే గడుపుతారు. చావులను సైతం హేళనగా మాట్లాడుతారు. కోడెల శివప్రసాద్ నుంచి ఎన్టీఆర్ కుమార్తె చావు వరకు వైసీపీ నేతలు మాట్లాడిన తీరు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం వైసిపి మార్క్ క్రూరత్వాన్ని తలపిస్తున్నాయి.

తిరుమలలో ఓ చిన్నారిని చిరుత లాక్కెళ్ళి చంపేసింది. దీంతో తిరుమలలో భక్తుల భద్రతపై విమర్శలు వ్యక్తమయ్యాయి. టీటీడీ నిర్లక్ష్యం స్పష్టంగా వెలుగు చూసింది. గత నెలలో కూడా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు తీసినంత పని చేసింది. అతి కష్టం మీద ఆ చిన్నారిని కాపాడగలిగారు. ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు. లక్షిత అనే చిన్నారి ప్రాణాలు పోగొట్టుకుంది.

లక్షిత తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందినవారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. జరిగిన ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. అంతటితో ఆయన ఆగి ఉంటే సరిపోయేది. కానీ మరింత అతిగా స్పందించారు. ఆయన మాటలు వింటే ఈయన మనిషేనా అన్న ఫీలింగ్ కలగక మానదు. ఈ ఘటనలో చిన్నారి లక్షిత తల్లిదండ్రులపై అనుమానం ఉందని… పోలీసులు వారిని లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. ఇది ఆడపిల్లలకు సంబంధించిన అంశం అని.. అందుకే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతి పై టీటీడీ చైర్మన్ తో మాట్లాడినట్లు ఎమ్మెల్యే వివరించారు.

బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. అందునా కలియుగ దైవం సన్నిధిలో ఈ ఘటన జరగడం వారిని కలచివేసింది. ఆ తల్లిదండ్రుల మానసిక స్థితి గురించి కూడా కనీసం ఆలోచన చేయరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫోరెన్సిక్ రిపోర్టులోను పులి లాక్కుపోయి చంపిందని తేలింది. తిరుమలలో భక్తుల భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. టీటీడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు వైసీపీ సర్కార్ పై ఒక విధమైన అపవాదు పడింది. దీని నుంచి బయట పడేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. భక్తుల భద్రతకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఇది భద్రత వైఫల్యం కాదని చెప్పేందుకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రయత్నించారు. ఇందుకుగాను ఆయన బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులపైనే నిందను మోపారు. రాజకీయాల కోసం ఇంతకి దిగజారుతారా అన్న విమర్శలను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మూట గట్టుకుంటున్నారు.