Kota Srinivasarao MLA: ‘రాజకీయం రౌడీయిజం ఒకటి కాదు రా రేయ్’.. చత్రపతి సినిమాలో కోటా శ్రీనివాసరావు( Kota Srinivas Rao) నోటి నుంచి వచ్చే డైలాగు ఇది. అయితే నిజజీవితంలో సైతం కోటా శ్రీనివాసరావు. రాజకీయాల్లో ధనస్వామ్యం పెరిగిందని.. డబ్బుంటే రాజకీయాలు చేయగలమని చెప్పి హుందాగా తప్పుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని.. తనకు గుర్తింపు తీసుకొచ్చిన కళా రంగం వైపే ఉండిపోయారు. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే.. మరోసారి ప్రయత్నం చేసే రోజులు ఇవి. అటువంటిది తాను రాజకీయాలకు సూట్ కానని చెప్పి హుందాగా తప్పుకున్న వ్యక్తి కోటా శ్రీనివాసరావు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశాన్ని సైతం వదులుకున్నారు.
హాస్య చతురత అధికం..
కోటా శ్రీనివాసరావు లో హాస్య చతురత అధికం. ఆపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టుకొని మాట్లాడతారు. నిర్మహమాటంగా ఏ విషయాన్ని అయినా చెబుతారు. 1999లో విజయవాడ తూర్పు( Vijayawada East) నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే పేరుకే ఎమ్మెల్యే కానీ.. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నది తక్కువేనని అప్పట్లో విమర్శలు వినిపించాయి. కృష్ణా జిల్లాకు చెందిన కోటా శ్రీనివాసరావుకు సినీ గ్లామర్ తోనే అప్పట్లో టిక్కెట్ వచ్చింది. అదే గ్లామర్ తో గెలిచారు. కానీ ఆ గెలుపును శాశ్వతం చేసుకోలేకపోయారన్న విమర్శ మాత్రం ఉంది. 1999- 2004 మధ్య ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ తర్వాత ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు.
ప్రత్యేక ఆకర్షణగా..
1999లో అసెంబ్లీలో అడుగు పెట్టారు కోటా శ్రీనివాసరావు. అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా బాబు మోహన్ (Babu Mohan) ఉండేవారు. ఆయన కోట శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు. ఆపై మంత్రి కూడా అయ్యాడు బాబు మోహన్. అప్పట్లో వీరిద్దరూ హాస్య చతురతతో అసెంబ్లీలో నవ్వులు పూయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే విలక్షణ నటుడిగా కోటా శ్రీనివాసరావు సినీ రంగంలో బిజీగా ఉండేవారు. ప్రతిరోజు మూడు షిఫ్టుల్లో పని చేసేవారు. రోజుకు 18 గంటలు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఆయన పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు. అప్పట్లో నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యే అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన క్రమేపి బిజెపికి దూరమయ్యారు. నేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.