Kommineni Srinivasa Rao Remanded: సీనియర్ జర్నలిస్ట్, సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు( Kommineni Srinivasa Rao ) షాక్ తగిలింది. ఆయనకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను గుంటూరు జిల్లా మంగళగిరిలోని కోర్టు ముందు హాజరు పరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం శ్రీనివాసరావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కొమ్మినేనిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా రైతుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. హైదరాబాదులో జర్నలిస్టు కాలనీలో శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో హాజరు పరచడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది.
* మహిళా రైతులపై అనుచిత వ్యాఖ్యలు..
కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టుగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా సాక్షి మీడియాలో( Sakshi media) పనిచేస్తున్నారు. ఆయన యాంకర్ గా ఉంటూ అమరావతి పై డిబేట్ నిర్వహించారు. ఈ క్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు ఆ డిబేట్లో పాల్గొన్నారు. అయితే అమరావతిలో వేశ్యలు ఉన్నారంటూ కృష్ణంరాజు కామెంట్స్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను కొమ్మినేని సమర్థించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కొమ్మినేని తో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
* సాక్షి యాజమాన్యంపై కేసు..
కొమ్మినేని అరెస్టుతో పాటు సాక్షి యాజమాన్యంపై కేసు పెట్టడాన్ని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే దీనికి మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు ఈ అరెస్టులను, అమరావతి మహిళా రైతుల నిరసనను కించపరుస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డిజిపి కి ఫిర్యాదు వచ్చింది. పిశాచులతో పోలుస్తూ సజ్జల చేసిన కామెంట్స్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా కేసు నమోదు అయింది.
* పోలీసుల గాలింపు
ఇంకోవైపు మరో నిందితుడిగా ఉన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు( journalist Krishnam Raju ) అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ ఘటనపై సాక్షి యాజమాన్యం స్పందించలేదు. కనీసం ఖండించలేదు కూడా. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో కృష్ణంరాజు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తాను అమరావతి మహిళా రైతులు అనలేదని.. అమరావతి పరిసరాలు అన్నానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి.. అరెస్టులు, రిమాండ్ల వరకు వెళ్లడం విశేషం.