Kolikapudi Srinivasa Rao: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో కలకలం సృష్టించింది విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం. ఆ ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై పార్టీ హై కమాండ్ సీరియస్ అయింది. ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. వేరువేరుగా హాజరైన వారిద్దరూ తమ అభిప్రాయాలను క్రమశిక్షణ కమిటీకి చెప్పారు. వివరణలు కూడా ఇచ్చారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ హై కమాండ్ కు ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికలో తప్పంతా కొలికపూడి శ్రీనివాసరావు దేనిని తేలింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తప్పిదాలు లేవని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే చర్యలు తీసుకునే బాధ్యతను చంద్రబాబు పై పెట్టారు. అయితే తగిన సమయంలో చర్యలు ఉంటాయని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
ఆది నుంచి వివాదాస్పదమే..
అయితే ఎన్నికైన నాటి నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ( MLA kolikapudi Srinivasa Rao) తీరు వివాదాస్పదంగానే ఉంది. ఎక్కడో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాసరావు మంచి వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు పొందారు. టిడిపి తో కలిపి అమరావతి ఉద్యమం చేశారు. చంద్రబాబు నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో కొలికపూడి ముందుండేవారు. అదే తెలుగుదేశం పార్టీని మరింత దగ్గర చేసింది. 2024 ఎన్నికల్లో తిరువూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో నుంచి కొలికపూడికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. కానీ వివాదాస్పద అంశాలలో ఇరుక్కుపోయి.. చెడ్డ పేరు తెచ్చుకున్నారు కొలికపూడి. ఇప్పుడు ఏకంగా క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనదే తప్పని తేల్చింది.
దాని వెనుక వ్యూహం..
తగిన సమయంలో ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు ఉంటాయని చంద్రబాబు( CM Chandrababu) చెప్పడం వెనుక చాలా వ్యూహం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే కొలికపూడి తన తీరు మార్చుకోకుంటే మాత్రం ఇబ్బందికరమే. మారేందుకు సమయం ఇస్తారు. మారకుంటే మాత్రం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తారు. మరింత వివాదాస్పదం అయ్యేలా చేస్తారు. అదే సమయంలో అక్కడ ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకుంటారు. ఒక ఎమ్మెల్యే ఎదురు తిరగడం ద్వారా, ఆయనపై చర్యలు తీసుకోవడం అనేది ప్రత్యర్థులకు వరంగా మారుతుంది. కచ్చితంగా ప్రత్యర్థి పార్టీ ఆయనతో మాట్లాడిస్తుంది. అందుకే పొలిటికల్ డామేజ్ రాకుండా ముందుగానే.. అంటే కొలికపూడి అదే ధోరణితో ముందుకు వెళితే మాత్రం ఆయన చుట్టూ ఒక అగాధం తవుతారు. ఒక రకమైన ముద్ర వేస్తారు. అలా క్రమశిక్షణ కట్టు దాటారని అభియోగాలు మోపుతూ చర్యలు తీసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కొలికపూడి గాజు మేడలో ఉన్నట్టే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా మూల్యం తప్పదు. మరి కొలికపూడి ఎలా ముందుకెళ్తారో చూడాలి.