Jagan big plan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయాన్ని గుణపాఠంగా మార్చుకున్నారు. 2029 ఎన్నికలు అంత ఈజీగా తమకు అనుకూలంగా మారవని ఆయన గ్రహించారు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని గుర్తించారు. అందుకు సంబంధించి కార్యాచరణను తయారు చేస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి.. వారితో మమేకమై.. 2029 ఎన్నికలను ఎదుర్కోవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళికగా తెలుస్తోంది. 2026 జనవరి నుంచి జనం బాట పట్టాలని ఒక షెడ్యూల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బెంగళూరుకు పరిమితం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. వారంలో మూడు రోజులు పాటు మాత్రమే తాడేపల్లి వస్తున్నారు. మధ్యలో ప్రత్యేక కారణాలు చెప్పి రావడం కూడా మానేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ వైఖరి పై సొంత పార్టీ శ్రేణులే విమర్శించే పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ నుంచి తాడేపల్లిలో అందుబాటులో ఉంటూ ఎన్నికల వరకు అదే పనిగా ప్రజల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూటమికి అవకాశం ఇవ్వకూడదని.. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు మళ్లీ కలిసి వెళ్తాయన్నది ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది కూడా. అందుకే దూకుడు పెంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
జనవరి నుంచి బస్సు యాత్ర..
ఈ రెండు నెలల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థా గత నిర్మాణం పూర్తి చేయనున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు జిల్లా బాధ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయనున్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను, బాధ్యులను నియమించే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర మొదలుకానుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వారానికి నాలుగు రోజులపాటు పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ నాటికి ఈ బస్సు యాత్ర ద్వారా జిల్లాల పర్యటనను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జూలైలో పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 2027లో మొదలయ్యే పాదయాత్ర.. 2029 ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈసారి దాదాపు 5 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.
పాదయాత్ర అలా
అయితే గతం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంత సులువుగా సాగే అవకాశం లేదు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర సమయంలో జరిగిన పరిణామాలు తెలుసు. పైగా మునుపటిలా అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసిన సమయంలో చాలా వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ వాటిని నెరవేర్చలేకపోయారు. కేవలం పథకాల ద్వారా సంతృప్తి పరచాలని చూశారు. అయితే లోకేష్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆ సమయంలో లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి మునుపటిలా పాదయాత్రలో ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అప్పట్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అధికార పార్టీతో సమానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఉండదన్నది విశ్లేషకుల మాట. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.