Kolikapudi MLA Controversy: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ( Srinivasa Rao ) మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. ఒకానొక దశలో పార్టీ హై కమాండ్ ఆయన విషయంలో తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఇటీవల కొలికపూడి వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఇంతలోనే మరో కలకలం రేగింది. ఎమ్మెల్యే కొలికపూడి వేధిస్తున్నారని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పి అదృశ్యమయ్యాడు ఓ ఉద్యోగి. ఇప్పుడు అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.
Also Read: అల్లర్లకు ప్లాన్.. మాజీ మంత్రి కుమారుడిపై కేసు!
బదిలీ నిలిపివేతతో..
ఇటీవల ఉద్యోగుల బదిలీ ( transfers ) ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కిషోర్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాసరావు తో పాటు ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక లేఖ రాసినట్లు సమాచారం. అదే విషయాన్ని తమ శాఖకు చెందిన ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అటు తరువాత ఆయన కనిపించకుండా పోయారు. అయితే కిషోర్ రాసిన లేఖకు రక్తపు మరకలు ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కిషోర్ గత నెలలోనే బదిలీ అయ్యారు. తిరువూరులో అద్దె ఇల్లును కూడా ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం కిషోర్ మావయ్య ఆయన ను కారులోనే ఆఫీసులో దింపారు. కానీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆఫీసు నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.
సూసైడ్ నోట్ లభ్యం..
అయితే సూసైడ్ నోట్ గా( suicide note) భావిస్తున్న ఆ లేఖను చూసిన తోటి శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగారు. మొబైల్ ఫోన్ ట్రేస్ చేశారు. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజారా దగ్గర సిగ్నల్ ట్రాక్ అయ్యింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అయితే సూసైడ్ నోట్లో మాత్రం ప్రముఖంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘ నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డిఈఈ ఉమా శంకర్, ఈఎన్సి శ్యాంప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కారణం. బదిలీ జరిగినా రిలీవ్ చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు జలవనురుల శాఖ సాధారణ బదిలీల్లో గౌరవరం సెక్షన్కు బదిలీ జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే బదిలీ ఆపి రాజకీయం చేశారు. నా బదిలీని అడ్డుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించారు. నేను దళిత ఉద్యోగిని. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పిఏ బొట్టు శ్రీనివాసరావు పై కఠిన చర్యలు తీసుకోవాలి ‘ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కిషోర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: తల్లికి వందనం డబ్బులు వెనక్కి.. ప్రభుత్వం కీలక ప్రకటన!
అధిష్టానం హెచ్చరికలతో..
అయితే గత కొంతకాలంగా వివాదాలకు దూరంగా ఉన్నారు తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. పార్టీ హై కమాండ్( High command ) గట్టిగానే హెచ్చరించడంతోనే ఆయన జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే పేరు చెప్పి సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకవేళ జరగరానిది జరిగితే మాత్రం అది ఎమ్మెల్యే శ్రీనివాసరావు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థులకు సైతం అదో ప్రచార అస్త్రంగా మారనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అయితే బదిలీల్లో రాజకీయ సిఫార్సులు అన్నవి సర్వసాధారణం. అయితే పాపం ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు తెలియకుండానే కొన్ని జరిగిపోతున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. చూడాలి ఈ ఘటన ఎటువైపునకు దారితీస్తుందో..?