Kodali Nani : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అమెరికా వెళ్ళనున్నారు. గత కొంతకాలంగా నాని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. మొన్న ఆ మధ్యన ముంబైలో ఆయనకు గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి నాని విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యమైన వారిని తప్ప ఎవరినీ కలవడం లేదు. మాజీ సీఎం జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న నాని మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్ళనున్నారు. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా అమెరికా వెళుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆయన అమెరికా వెళుతున్నారని.. ఆపరేషన్ అనంతరం అమెరికా వెళ్లాల్సి ఉందని.. కోలుకున్నాక వెళ్లాలని వైద్యుల సూచన మేరకు అప్పట్లో ఉండి పోయారు. ఇప్పుడు వైద్యులు సూచించడంతో అమెరికా వెళుతున్నారు.
Also Read : ప్రధాని మోదీతో లోకేష్ ఆప్యాయత.. యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ.. గిఫ్ట్ అదుర్స్!
* ముంబైలో బైపాస్ సర్జరీ..
కొద్ది నెలల కిందట కొడాలి నాని( Kodali Nani ) అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాదులో వైద్య పరీక్షలు చేయగా గుండెపోటు అని తేలింది. గుండెలో మూడు రక్తనాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవసరమని నిర్ధారించడంతో ప్రత్యేక విమానంలో ముంబాయికి తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు 8 గంటల పాటు శ్రమించిన వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అటు తరువాత నాని కోల్పోవడంతో హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
* కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరం..
కొడాలి నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఫిబ్రవరి 13న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vamsi Mohan )అరెస్టు అయ్యారు. ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలులో ఉంచారు. వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ సమయంలో ఆయన వెంట కొడాలి నాని ఉన్నారు. అయితే అప్పట్లో కూడా మీడియా ముందుకు వచ్చి హుషారుగానే మాట్లాడారు నాని. కానీ అక్కడకు కొద్ది రోజులకే అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు నాని ఆరోగ్యం పై ఆరా తీశారు. మరోవైపు నాని కోలుకున్నట్లుగా పార్టీ నేతలు సైతం వెల్లడించారు.
* హైదరాబాదులో విశ్రాంతి..
ప్రస్తుతం హైదరాబాదులో( Hyderabad) విశ్రాంతి తీసుకుంటున్నారు కొడాలి నాని. పార్టీలో ముఖ్య నేతలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఆపరేషన్ అనంతరం వైద్యుల సూచన మేరకు ఎవరిని కలవడం లేదు. కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కేవలం మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్ళనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం నాని పొజిషన్ చూస్తుంటే ఆయన కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది. మరి గుడివాడ నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.