Kidney Racket: పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటారు. వారికి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పి కిడ్నీలను మార్చుతున్నారు. ఇందుకుగాను తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ముఠా ను నడుపుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సరికొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. కిడ్నీ మార్చి క్రమంలో యమునా అనే మహిళ మృతి చెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆసుపత్రిలో తనిఖీలు చేసి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రాకెట్ కు ప్రధాన సూత్రధారి అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. అయితే ఈ రాకెట్ లో కొంతమంది ప్రభుత్వ అధికారులు సైతం ఉన్నట్లు తేలడం సంచలనం సృష్టించింది.
* కీలక అధికారుల హస్తం..
అన్నమయ్య( Annamayya district) డి సి హెచ్ ఎస్ గా డాక్టర్ ఆంజనేయులు ఉన్నారు. ఆయన కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఒక ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మదనపల్లి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు, పుంగనూరు డయాలసిస్ కేంద్రం మేనేజర్ వెంకటేష్ నాయక్ హస్తం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. డయాలసిస్ కేంద్రాలకు వచ్చే ధనికులకు డాక్టర్ శాశ్వతి గుర్తించి.. కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు తెర తీసినట్లు సమాచారం. ఇందుకుగాను తెలంగాణ వ్యాప్తంగా కొందరు బ్రోకర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ అత్యవసరాలకు గాను కిడ్నీలను విక్రయించే వారిని గుర్తించి మదనపల్లికి తెప్పించి ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విశాఖకు చెందిన సూరిబాబు భార్య యమునా అనే మహిళను కిడ్నీ రాకెట్ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేష్ కలిశారు. కిడ్నీ ఇస్తే 8 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మబలికారు. కుటుంబ అవసరాలకు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది యమున.
* కిడ్నీ తీసే క్రమంలో మృతి..
మదనపల్లె( Madanapalle) తీసుకొచ్చి.. మంగళవారం ఉదయం ఆపరేషన్ చేసి కిడ్నీ బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం విషమించి మృతి చెందారు. అయితే ఆమె మృతిని గోప్యంగా ఉంచేందుకు గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నం చేసింది. యమున మృతదేహాన్ని తిరుపతి మీదుగా విశాఖకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. దీనిపై భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. తెర వెనుక ఎవరెవరు సహకారం అందించింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఎప్పటినుంచి ఈ కిడ్నీ రాకెట్ కొనసాగుతుందోనన్న కూపీ లాగుతున్నారు.