Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇక తరువాత ఎవరు అనే అనుమానం కలుగుతోంది. అయితే ఈసారి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి పెద్దిరెడ్డి మాట రావడంతో ఆయన అరెస్టు ఉంటుందని ప్రచారం సాగుతోంది. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత వెలుగు వెలిగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుటుంబ హవాను సైతం పెంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా రాయలసీమ బాధ్యతలను కట్టబెట్టారు. చంద్రబాబును టార్గెట్ చేసే పనిని అప్పగించారు. ఇప్పుడదే పెద్దిరెడ్డికి మైనస్ గా మారుతుంది. పెద్దిరెడ్డి టార్గెట్ కావాల్సి వస్తోంది.
* పవన్ పర్యటన..
ఇటీవల పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఎర్రచందనం నిల్వలను పరిశీలించారు. అక్కడి అటవీస్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన అటవీ భూముల ఫోటోలను తీసినట్లు కూడా వెల్లడించారు. దీంతో త్వరలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు ఉంటుందని ప్రచారం ప్రారంభం అయింది. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుంటే.. ఆ కుటుంబ ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. 2029 నాటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వీర్యం చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. మరోవైపు జగన్ వెంట పెద్దిరెడ్డి కుటుంబం కనిపించకపోవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
* దశాబ్దాల వైరం..
ఏపీ సీఎం చంద్రబాబుకు( CM Chandrababu) సమకాలీకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వారిద్దరి మధ్య దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో బాగా ఎదిగారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంలో ముందు వరుసలో నిలిచారు. అదే జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేసింది. ఒకవైపు పార్టీని నిలబెట్టడమే కాదు చంద్రబాబును ఎదుర్కోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవసరాన్ని గుర్తించారు జగన్. అందుకే ఫుల్ పవర్స్ ఇచ్చారు. రాయలసీమ బాధ్యతలను పెద్దిరెడ్డికి ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. దీంతో రాయలసీమకు ముఖ్యమంత్రిగా మారిపోయారు పెద్దిరెడ్డి. చంద్రబాబును సొంత నియోజకవర్గ కుప్పంలో అడుగుపెట్టనీయకుండా చేయాలని చూశారు. ఈ క్రమంలో గట్టిగానే దూకుడుగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు.
* అధికారంలోకి వచ్చింది మొదలు..
అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎవరిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయరు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మొదలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. దానికి కారణాలు లేకపోలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ రెండింటా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఒకే చోట పోటీ చేశారు. అయితే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయి. ఒకవైపు ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగగా.. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం పెద్ద ఎత్తున రాయలసీమ రౌడీలను మొహరించినట్లు అప్పట్లో స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పవన్ గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఏరి కోరి అటవీ శాఖను తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే అది పెద్దిరెడ్డి లెక్క తేల్చడానికి ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టు ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. చూడాలి పవన్ ఎలా ఇంకా దూకుడుగా అడుగులు వేస్తారో..