AP Assembly Election Results 2024: ఏపీలో అధికార పార్టీకి షాక్ తప్పలేదు. మంత్రులు, కీలక నేతలకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా జగన్ క్యాబినెట్లో కీలక మంత్రులు పరాజయం దిశగా దూసుకెళ్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 25 మందితో తొలి క్యాబినెట్ ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాలన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. ఓ నలుగురు వరకు పాతవారిని..మిగతా 20 మంది వరకు కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే ఆది నుంచి జగన్ క్యాబినెట్ డమ్మీ అని విమర్శలు ఉన్నాయి. పేరుకే మంత్రులు కానీ.. ఒకరికి శాఖపై పట్టు లేదన్న విమర్శలు వచ్చాయి. అయితే అటువంటి మంత్రులంతా ప్రజాక్షేత్రంలో ఓడిపోవడం విశేషం.
జగన్ క్యాబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన డాక్టర్ సిదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, విడదల రజిని, ఆదిమూలం సురేష్, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్ ఓటమి బాటలో ఉన్నారు. అయితే సీనియర్లుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, పిడికె రాజన్న దొర, తానేటి వనిత దాడిశెట్టి రాజా వంటి వారు సైతం వెనుుకబడడం ఆందోళన కలిగిస్తోంది. వారు సైతం ఓడిపోతారా? బయటపడతారా? అన్నది చూడాలి.
2019 ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వంలో సైతం మెజారిటీ మంత్రులు ఓడిపోయారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న అచ్చెనాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు మాత్రమే గెలిచారు. మిగతా 22 మంది ఓడిపోయారు. అయితే ఇప్పుడు కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఎదురు కావడం విశేషం. మంత్రులంతా భారీ మెజారిటీతో ఓడిపోగా.. గెలిచినవారు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా తాజా మాజీ మంత్రులు రాజకీయాలకే పరిమితం అయ్యారన్న విమర్శ ఉంది. అందుకే ప్రజలు ఓడించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఒక్క జగన్ మినహాయించి మంత్రులంతా ఓటమి బాటలో ఉండడం విశేషం.