Ys vivekanandareddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే శాసనసభ వేదికగా ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ సీఎం చంద్రబాబు సౌండ్ చేశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ఉన్న వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు ఆదేశాలతో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును.. సాక్షుల జాబితాలో చేర్చడం విశేషం. 2019 ఎన్నికలకు ముందు.. మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఎన్నికల్లో వివేకా హత్య జగన్ కు ఎనలేని సానుభూతి తెచ్చిపెట్టింది. వైసీపీ విజయానికి దోహద పడింది. అప్పట్లో సిబిఐ విచారణకు జగన్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పుకొచ్చారు. కానీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఎంటర్ అయ్యారు. సొంత కుటుంబ సభ్యులే నిందితులుగా పేర్కొన్నారు. సిబిఐ సైతం ఇదే అభిప్రాయానికి వచ్చింది. నిందితులుగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శంకర్ రెడ్డి, దస్తగిరి తదితరుల పేర్లను పొందుపరిచింది. ఈ కేసులో తొలుత భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎన్నికలకు ముందు ముందస్తు బెయిల్ ఆయనకు దక్కింది. అవినాష్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. దక్కడంతో బయటకు వచ్చారు. అయితే వివేకానంద రెడ్డి కారు డ్రైవర్ గా ఉన్న దస్తగిరి సైతం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే తాను అప్రూవర్ గా మారుతానని ముందుకు వచ్చాడు. ఇందులో అవినాష్ రెడ్డి ప్రధాన పాత్రధారుడని.. జగన్ తో పాటు ఆయన భార్య భారతికి సైతం సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశాడు.
* 2019 ఎన్నికలకు ముందు..
ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జగన్ పట్ల సానుకూలతతో ఉందన్న వార్తలు వచ్చాయి. అందుకే ఈ కేసు విషయంలో కాస్త ఉపశమనం దక్కింది. కానీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్రంలోని ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. జగన్ పాత కేసులను తిరగదోడే పనిలో పడ్డారు చంద్రబాబు.అందులో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరు.. సాక్షుల జాబితాలోకి రావడం జగన్ కు షాక్ ఇచ్చే విషయం.
*ఈ ఎన్నికల్లో డ్యామేజ్
ఈ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య అంశం వైసీపీకి మైనస్ గా మారింది. 2019 ఎన్నికల్లో ఇదే హత్య వైసీపీకి సానుభూతి తెచ్చి పెట్టింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వైయస్ వివేక కుమార్తె సునీత, షర్మిలాలు ఊరు వాడా వివేక
హత్య పైనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. వివేక కుమార్తె సునీత అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హత్య ఘటనను వివరించే ప్రయత్నం చేశారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైసీపీకి మైనస్ గా మారింది.
* అప్రూవర్ గా దస్తగిరి
నిందితుడిగా ఉన్నప్పుడే దస్తగిరి అప్రూవర్ గా మారారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేయించారని కూడా ఆరోపించారు. తెర వెనుక జగన్ తో పాటు ఆయన భార్య భారతి ఉన్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా వెనుకడుగు వేయరని ఎన్నికలకు ముందు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే దస్తగిరి నిందితుల జాబితా నుంచి తప్పించింది సిబిఐ. సాక్షుల జాబితాలో చేరడంతో దస్తగిరి ఎలా అడుగులు వేస్తారో నన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. ఆయన ఇచ్చిన కీలక సమాచారం మేరకు సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అటు కూటమి పాలకుల ప్రకటనలు కూడా అలానే ఉన్నాయి. దీంతో ఏపీలో కొద్ది రోజుల్లో సంచలన ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.