Papua New Guinea: ఎటు చూస్తే అటు రక్తం.. కనుచూపుమేరలో దహనమైన ఇళ్ళు. గుండెను ద్రవింపజేసే ఆర్తనాదాలు. హృదయాన్ని మెలిపెట్టే శోకాలు..ఒకరా ఇద్దరా .. పదులకొద్దీ జనం చనిపోయారు. అందులో మహిళలున్నారు. పసిపిల్లలు కూడా ఉన్నారు. మహిళలనైతే వివస్త్రలను చేశారు. సామూహిక అత్యాచారం చేశారు. కొందరి మృతదేహాలపై తలలు కూడా లేవు. చదువుతుంటే కన్నీరు ఊబికి వస్తోంది కదూ.. బాబోయ్ ఇలా కూడా చేస్తారా అని భయం వేస్తోంది కదూ.. ఈ హృదయ విదారక సంఘటన జరిగింది పపువా న్యూ గినియా అనే దేశంలో.. ఈ దేశంలో భూ హక్కుల గురించి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో సాయుధ గ్యాంగ్ 26 మందిని చంపేసింది. అంతేకాదు వారు ఉంటున్న గ్రామాన్ని దహనం చేసేసింది.
పపువా న్యూ గినియా ప్రాంతంలో గత కొద్దిరోజులుగా భూహక్కుల గురించి పోరాటాలు జరుగుతున్నాయి. ఆదివాసీల మధ్య జరుగుతున్న ఈ పోరాటాలు తీవ్రమైన హింసకు దారితీస్తున్నాయి. పపువా న్యూగీనియాలోని ఉత్తర ప్రాంతంలో ఓ మారుమూల మూడు గ్రామాలలో ఇటీవల భూ హక్కులకు సంబంధించి గొడవలు చోటుచేసుకున్నాయి. తాము సాగు చేస్తున్న భూములకు సంబంధించి ఆదివాసులు పరస్పరం గొడవపడ్డారు. అది కాస్త తీవ్రమైన హింసకు దారితీసింది. అయితే ఇందులో ఒక వర్గం ఆయుధాలతో మరో వర్గంపై దాడి చేసింది. కత్తులు, గొడ్డళ్లు, తుపాకులతో పాశవికంగా దాడి చేసింది. ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు. అంతేకాదు వారు ఉంటున్న గృహాలను కాల్చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. “దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఓ మారుమూల మూడు గ్రామాల్లో గొడవ చోటు చేసుకుంది. దాదాపు 26 మందిని ఆయుధ గ్యాంగ్ హతమార్చింది. ఇది అత్యంత భయంకరమైన సంఘటన. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. మహిళలపై సామూహిక అత్యాచారం జరిగినట్టు అక్కడ దృశ్యాలు చూస్తే కనిపిస్తోంది. ఈ మారణ హోమంలో దాదాపు 30 మంది దాకా సాయుధులు పాల్గొన్నారని” ఈస్ట్ సేఫిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ చెబుతున్నారు.
అయితే ఈ గ్రామాలలో జరిగిన మారణ హోమం వల్ల 26 మంది చనిపోయారు. అయితే ఇందులో కొన్ని మృతదేహాలు కుళ్ళిపోయాయి. మరి కొన్ని మృతదేహాలను రాత్రి వేళల్లో మొసళ్లు గ్రామాల్లోకి వచ్చి నదిలోకి ఈడ్చుకెళ్లిపోయాయి. ఆ నది సరిహద్దుల్లో చాలావరకు మనుషుల అవయవాలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. “నది తీరం దారుణంగా ఉంది. మనుషుల పుర్రెలు, కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు కనిపిస్తున్నాయి. చూసేందుకు ఆ ప్రాంతం మొత్తం దారుణంగా ఉంది. సాయుధ గ్యాంగ్ మనుషులను చంపేస్తే.. ఆ మృతదేహాలను మొసళ్ళు నదిలోకి లాక్కెళ్లాయి. అవి తిన్న తర్వాత ఇతర శరీర భాగాలను ఒడ్డున పడేశాయని” పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన భూ హక్కుల కోసమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో చాలామంది తల్లీ పిల్లలే. సుమారు 16 మంది దాకా చిన్నారులు ఈ మారణ హోమంలో కన్నుమూశారని స్థానిక మీడియా చెబుతోంది. దాడి అనంతరం చాలామంది గ్రామస్తులు పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయారు.
ఇక పపువా న్యూ గినియాలోని ఉత్తర ప్రాంతంలో భూ హక్కుల కోసం కొద్ది రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి . చాలా ప్రాంతాలలో శాంతిభద్రతలు కట్టుతప్పాయి. గతంలో కూడా హైలాండ్స్ అనే ప్రాంతంలో ఇలానే గొడవలు జరిగాయి. అప్పుడు సుమారు 26 మందిని సాయుధ గ్యాంగ్ హత్య చేసింది. ఆ సమయంలో అక్కడ పోలీసులు కర్ఫ్యూ విధించారు. గత ఏడాది ఎంగా ప్రావిన్స్ లో ఇదే స్థాయిలో భూ వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో మూడు నెలల పాటు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధించారు.